General Elections-2024: సార్వత్రిక ఎన్నికలు: ముగిసిన మూడో దశ పోలింగ్
- దేశంలో మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు
- నేడు మూడో దశ పోలింగ్
- 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనుండగా, నేడు మూడో దశ పోలింగ్ చేపట్టారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
మూడో దశలో 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది. ఈ దశలో గుజరాత్ లోనూ పోలింగ్ జరగ్గా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా, నేటి పోలింగ్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 60 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే... బీజేపీ పాలిత అసోంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చారు.
పశ్చిమ బెంగాల్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 73.9 శాతం పోలింగ్ జరిగింది. ఛత్తీస్ గఢ్ లో 66.87 శాతం, మధ్యప్రదేశ్ లో 62.28 శాతం, మహారాష్ట్రలో 53.40 శాతం, గుజరాత్ లో 55.22 శాతం, బీహార్ లో 56 శాతం, ఉత్తరప్రదేశ్ లో 51.53 శాతం ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.