Pawan Kalyan: ముద్రగడ అనుమతి తీసుకుని ఆయన కుమార్తెను పార్టీలో చేర్చుకుంటాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan talks about Mudragada daughter issue
  • కాకినాడ జిల్లా తునిలో వారాహి విజయభేరి సభ
  • ముద్రగడ కుమార్తె క్రాంతి అంశాన్ని ప్రస్తావించిన పవన్
  • ఆమె జనసేనకు మద్దతిస్తే నన్ను తిడుతున్నారు అంటూ ఆవేదన
  • తాను కుటుంబాలను కలిపేవాడ్నే తప్ప విడదీసే వాడ్ని కాదని స్పష్టీకరణ
కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. బూతులు, మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లు... వైసీపీ ప్రభుత్వం గురించి ఇంతకంటే బాగా చెప్పలేం అని అన్నారు. పోలవరం నిర్మించడం సంగతి అటుంచితే కనీసం చెరువుల్లో పూడిక కూడా తీయించడం చేతకాని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. 

ఓడిపోయేవాడే దాడులు చేస్తాడని, వైసీపీ ఓడిపోతోంది కాబట్టే మనవాళ్లపై దాడులకు దిగుతున్నారు అంటూ పవన్ పేర్కొన్నారు. సొంతచెల్లెలికి ఆస్తులు ఇవ్వడు, తల్లికి గౌరవం ఇవ్వడు, 30 వేల మంది ఆడపిల్లలు కనిపించుకుండా పోతే స్పందించని వ్యక్తి, విశాఖలో రూ.25 వేల కోట్ల విలువైన భూములు తాకట్టు పెట్టిన వ్యక్తి... రేపు మీ భూముల జోలికి రాడని గ్యారెంటీ ఏంటి అని పవన్ ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమార్తె (క్రాంతి) అంశాన్ని కూడా జనసేనాని ప్రస్తావించారు. "ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడారు. అందుకు నేనే కారణం అంటూ నన్ను తిడుతున్నారు. నేను కులాలను, మనుషులను కలిపే వ్యక్తిని తప్ప... కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాను. ముద్రగడ పద్మనాభంతో నాకు విభేదాలు లేవు. ఆయన కుటుంబాన్ని విడదీయాలనే ఆలోచన లేదు. 

ఆయన కుమార్తె మన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు. ఆమెను నా సోదరిలా గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే ముద్రగడ కుమార్తె జనసేనపార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడ గారితో మాట్లాడి ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు పది మాటలు అంటారు... నేను ముద్రగడను, ఆయన కుమార్తెను కలుపుతాను. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెడతాను... గౌరవిస్తాను. ముద్రగడ వైసీపీకి వెళితే మాకేమీ ఇబ్బంది లేదు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను" అని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి... ఎన్నికలకు వారం రోజుల సమయం ఉంది... నేను మాట్లాడిన ప్రసంగాలు వినండి. మన మేనిఫెస్టో చదవండి... గత ఐదేళ్లలో ఏం నష్టపోయారో తెలుసుకోండి... ఆలోచించి ఓటు వేయండి అని పవన్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Mudragada Padmanabham
Kranthi
Janasena
YSRCP
Tuni
Kakinada District

More Telugu News