Pawan Kalyan: వైసీపీ వాళ్లకు కూడా చెబుతున్నా... జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై హక్కు వదిలేసుకున్నట్టే: పవన్ కల్యాణ్

Pawan Kalyan warns about land titling act

  • కృష్ణా జిల్లా గుడివాడలో వారాహి విజయభేరి సభ
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను హెచ్చరించిన జనసేనాని
  • ఈ చట్టం వల్ల... భూములపై లోన్ తెచ్చుకునే అవకాశం ఉండదని వెల్లడి
  • ప్రజల ఆస్తులు గాల్లో దీపాలుగా మారిపోతాయని వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్  గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని విమర్శించారు. 

ఈ చట్టం వల్ల... మన భూములపై కనీసం లోన్ తెచ్చుకునే అవకాశం కూడా ఉండదని, ఎందుకంటే, భూముల ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందని వివరించారు. ప్రజల భూములపై ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది జగన్ భూ దోపిడీ విధానం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

ముందు పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడని, ఆ తర్వాత సరిహద్దు రాళ్లపై తన బొమ్మ వేసుకున్నాడని  తెలిపారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని, జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారట అని వివరించారు. జిరాక్స్ కాపీలతో మనకు ఎవరైనా లోన్లు ఇస్తారా... ఇదొక పిచ్చి చట్టం అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ మద్దతుదారులకు కూడా ఒకటే చెబుతున్నా... మీరు జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై మీరు హక్కులు వదిలేసుకున్నట్టే అని హెచ్చరించారు. మీ ఆస్తులు గాలిలో దీపంలా మారిపోతాయి అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి?

రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసేశారు? ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? జగన్ గుర్తుంచుకో... మీ నాన్న కంటే ముందు చాలా మంది గొప్పవాళ్లు ఉన్నారు. మీ నాన్న పేరు పెట్టుకోవద్దు అనడంలేదు... కానీ ఇతర మహనీయులు ఎంతోమంది ఉన్నారు... వారికి గౌరవం కల్పించాలి.

వైసీపీ నేతల తిట్లకు ట్యాక్స్ వేస్తే...!

వైసీపీ నేతలు తిట్టినన్ని తిట్లు ఇంకెవరూ తిట్టలేదు. వైసీపీ నాయకులు తిట్టిన ప్రతి తిట్టుకు ట్యాక్స్ వేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్య, వైద్య సదుపాయం అందించవచ్చు. రాష్ట్రంలో రోడ్లపై గోతులు, వైసీపీ నేతల నోటి నిండా బూతులు, మొత్తం కేసులు అన్నట్టుగా ఉంది రాష్ట్ర పరిస్థితి!

కూటమి ప్రభుత్వం పక్కా... మెజారిటీ ఎంతో తేలాల్సి ఉంది


ఏపీలో రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయం. జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉంది. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో ఉన్నారు... గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఆయనను పార్లమెంటుకు పంపుదాం. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నేత వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు... ఆయనకు ఓటేసి గెలిపించండి.

  • Loading...

More Telugu News