snake: టాయ్ లెట్ కు వెళ్తుండగా కమోడ్ లో పాము బుసలు!
- భయంతో పరుగులు తీసిన యువకుడు
- వెంటనే స్నేక్ క్యాచర్ కు ఫోన్.. 10 అడుగుల పామును బయటకు తీసిన వైనం
- మహారాష్ట్రలో ఘటన
సాధారణంగా ఎవరికైనా ఇంట్లో పాము దూరితేనే భయమేసి ఆమడ దూరం పరిగెడతారు.. ఇక సోఫోలోనో, బూటు లోపలో పాము కనిపిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా బాత్రూంకు వెళ్లినప్పుడు కమోడ్ లో పాము బుసలు కొడుతున్న చప్పుడు వినిపిస్తే..!! మహారాష్ట్రలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూంకు వెళ్లగా కమోడ్ లోపల నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అయితే ముందు అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైప్ లైన్ ఏమైనా లీక్ కావడం వల్లో లేదా పైప్ లైన్ లో ఏమైనా చెత్త ఇరుక్కోవడం వల్లో ఆ శబ్దం వస్తోందని భావించాడు. కానీ ఆగకుండా శబ్దం వస్తుండటంతో టాయ్ లెట్ సీట్ కిందకు తొంగి చూశాడు. అంతే.. ఒక్కసారిగా అతని గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే.. లోపల నుంచి ఓ పెద్ద పాము అతన్ని చూస్తూ బుసలు కొడుతోంది. దీంతో ఒక్క ఉదుటున పైకి లేచి అతను బయటకు పరుగు తీశాడు. పాములు పట్టడంలో పేరున్న షీతల్ కాసర్ అనే యువతికి వెంటనే ఫోన్ చేశాడు. ఆమె వచ్చి 10 అడుగుల పొడవున్న ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసింది. దాన్ని చేత్తో పట్టుకొని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లింది.
ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. దామన్ స్నేక్ గా పిలిచే ఈ పామును ఇండియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తారని షీతల్ చెప్పింది. మొహంపై కుట్లు వేసినట్లు కనిపించే ఈ పాములు చాలా వేగంగా కదులుతాయని తెలిపింది. సుమారు 9 నుంచి 10 అడుగుల పొడవు ఉండే ఈ పాము విషపూరితమైనది కాదని తెలిపింది. ఎలుకల బొరియలు, ఇళ్ల పరిసరాల్లో ఈ పాములు ఎక్కువగా సంచరిస్తాయని.. ఎలుకలు, కప్పలను ఆహారంగా తింటాయని వివరించింది.