General Elections-2024: ఏపీలో 14 సమస్యాత్మక నియోజకవర్గాలు ఇవే... వాటిలో 100 శాతం వెబ్ కాస్టింగ్: ముఖేశ్ కుమార్ మీనా

AP CEO Mukesh Kumar Meena press meet ahead of polling

  • ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు
  • విజయవాడలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్
  • ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు 
  • ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 864 ఎఫ్ఐఆర్ లు 
  • ఇప్పటివరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలకులు కొన్ని నియోజకవర్గాలను సమస్యాత్మకం అని గుర్తించారని, వారి సిఫారసుల మేరకు 14 నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. 

పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు... ప్రకాశం జిల్లాలో ఒంగోలు... నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ... తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి... ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్... చిత్తూరు జిల్లాలో పుంగనూరు, పలమనేరు... అన్నమయ్య జిల్లాలో పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని మీనా చెప్పారు. 

ఎన్నికల పరిశీలకుల సిఫారసుల మేరకు సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో చర్చించిన మీదట ఇవాళ ఆదేశాలు జారీ చేశామని అన్నారు. 

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో సర్వీస్ ఓటర్ల సంఖ్య 65,707 అని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

ఓటర్ల సంఖ్య 1,500 దాటితో ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీలో ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని మీనా వెల్లడించారు.  

ఈసారి వాతావరణం కూడా చాలా కఠినంగా ఉందని, రాష్ట్రంలో కొన్నిచోట్ల 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసిందని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని బట్టి షామియానాలు, టెంట్లు, తాగునీరు, గొడుగులు, కుర్చీలు, ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయాలని పేర్కొందని వివరించారు. 

ఏపీలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 864 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని, వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా 9 వేల కేసులు నమోదు చేశామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశామని అన్నారు. రూ.105 కోట్ల విలువైన నగలు, రూ.47 కోట్ల నగదు సీజ్ చేసినట్టు చెప్పారు. 

సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 16,345 ఫిర్యాదులు అందాయని, వాటిలో 10,403 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. 

ఇక, జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. జనసేన పార్టీ పోటీ చేసే రెండు లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని తెలిపారు. 

అదే సమయంలో జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ నియోజకర్గాలు ఏ లోక్ సభ స్థానాల పరిధిలోకి వస్తాయో, ఆ లోక్ సభ స్థానాల పరిధిలో కూడా గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించబోమని ఈసీ ఏపీ హైకోర్టుకు స్పష్టం చేసిందని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు. అందుకు ఏపీ హైకోర్టు కూడా అంగీకరించిందని వెల్లడించారు. 

ఈ మేరకు పలు నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు గుర్తులు మార్చడం జరిగిందని, వారికి నోటీసులు ఇచ్చామని అన్నారు. వారికి రెండో ఆప్షన్ ప్రకారం గుర్తులు కేటాయించి, అభ్యర్థుల తుదిజాబితా ఖరారు చేశామని పేర్కొన్నారు.

More Telugu News