blue hole: బ్లాక్ హోల్స్ మనకు తెలుసు.. మరి ప్రపంచంలోనే లోతైన బ్లూ హోల్ గురించి విన్నారా?
- మెక్సికోలోని చెటుమాల్ బే ప్రాంతంలో టాం జా బ్లూ హోల్ లోతు ఏకంగా 1,380 అడుగులున్నట్లు గుర్తింపు
- ఇప్పటివరకు కనుగొనని జీవజాలం ఇందులో జీవించి ఉండే అవకాశం
- సైంటిస్టుల అధ్యయనం వివరాలను ప్రచురించిన ‘ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్’
విశ్వంలోని భారీ బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు) గురించి తెలిసిందే. మరి మీరెప్పుడైనా భూమ్మీద ఉన్న లోతైన బ్లూ హోల్ గురించి విన్నారా? సైంటిస్టులు తాజాగా ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన బ్లూ హోల్ (సముద్ర బిలం)ను గుర్తించారు.
దీని లోతు ఎంతో తెలుసా..? సముద్రమట్టానికి దిగువన 1,380 అడుగులు (420 మీటర్లు). అంటే షికాగోలోని ప్రఖ్యాత ట్రంప్ టవర్ కూడా ఇందులో మునిగిపోయేంత లోతు అన్నమాట!
మెక్సికోలోని చెటుమాల్ బే ప్రాంతంలో ఉంది ఇది. దీని పేరు టాం జా బ్లూ హోల్. దీని లోతును శాస్ర్తవేత్తలు ఇటీవల కొలిచారు. ఇప్పటివరకు అత్యంత లోతైన బ్లూ హోల్ గా రికార్డుకెక్కిన దక్షిణ చైనా సముద్రంలోని శాన్షా యోంగల్ బ్లూ హోల్ కన్నా టాం జా బ్లూ హోల్ 480 అడుగుల లోతు ఎక్కువ. ఇందుకు సంబంధించిన అధ్యయనం వివరాలను ‘ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్’ ప్రచురించింది. ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనని జీవజాలం ఇందులో జీవించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎలా ఏర్పడ్డాయి?
కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రవహించిన హిమనీనదాలు కొన్ని ప్రదేశాల్లో లోపలకు కుచించుకుపోవడం వల్ల బ్లూ హోల్స్ ఏర్పడతాయి. అంటే ఇవి మహాసముద్రాల్లో దాగిన నిట్టనిలువు గుహల్లాంటివి. సింక్ హోల్స్ లాగా గుండ్రంగా ఉంటాయి.
అయితే ఈ బ్లూ హోల్స్ లో అన్వేషణ సాగించడం పరిశోధకులకు సవాలే. ఎందుకంటే.. వీటిలో ఆక్సిజన్ ఉండదు. పైగా ప్రమాదకర హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఉంటుంది. అందువల్ల ప్రత్యేకమైన పరికరాలతోపాటు నైపుణ్యంగల డైవర్లు మాత్రమే వీటి లోతుల్లోకి చేరుకోగలరు.
ఇటీవలి పరిశోధనలకు సైంటిస్టులు రియల్ టైంలో నీళ్ల నుంచి డేటాను అందించగల 1,640 అడుగుల పొడవైన కేబుల్ ను ఈ బ్లూ హోల్ లోపలకు పంపారు. కానీ ఆ కేబుల్ 1,380 అడుగుల వరకే వెళ్లగలిగింది. ఈ బ్లూ హోల్ లోపల ఒక దానితో ఒకటి అనుసంధానమైన గుహలు, సొరంగాలు ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
2012లో బహమాస్ దీవుల్లోని బ్లూ హోల్స్ ను అన్వేషిస్తున్న సైంటిస్టులు అక్కడ ఒక ప్రత్యేక రకమైన బ్యాక్టీరియా జీవిస్తున్నట్లు గుర్తించారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా మానవ ఊహకు అందనట్లుగా జీవం ఉనికికి అవకాశం కల్పిస్తాయని ఆ పరిశోధనలో శాస్ర్తవేత్తలు తెలుసుకున్నారు.