Perni Nani: సర్కస్ మొదలైంది... కూటమి మేనిఫెస్టోపై మూడో ఫొటో ఏదీ?: పేర్ని నాని వ్యంగ్యం
- ఇవాళ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్
- మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ ఫొటోలు
- కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడన్న పేర్ని నాని
- ఈ మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసిందని వ్యాఖ్యలు
ఇవాళ కూటమి మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసినందున, రాష్ట్రాల స్థాయిలో మేనిఫెస్టోలతో ఆ పార్టీ అనుసంధానం కావడంలేదని, అందుకే టీడీపీ, జనసేన పార్టీల ఆలోచనలకు అనుగుణంగా మేనిఫెస్టో విడుదల చేశామని చంద్రబాబు చెప్పారు. తమ మేనిఫెస్టోకు ఎన్డీయే సహకారం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయగా, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఓ పక్కగా నిలుచున్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు, పవన్ ఇవాళ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు. కూటమి మేనిఫెస్టో అంటున్నా దానిపై రెండు ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయని, మూడో ఫొటో ఏమైందని ఎత్తిపొడిచారు.
"2014లో ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చారు? ఆ ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే ధైర్యం ఉందా? 2019 ఎన్నికల సమయంలో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు... మళ్లీ ఇప్పుడెందుకు కలిశారు?" అంటూ పేర్ని నాని నిలదీశారు.