Mahindra XUV 3XO: కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో కొత్త కారు తీసుకువచ్చిన మహీంద్రా

Mahindra launches new XUV 3XO

  • ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ పేరిట మహీంద్రా కొత్త కారు
  • నేడు లాంచ్ చేసిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం
  • రూ.7.49 లక్షల నుంచి ధరల శ్రేణి ప్రారంభం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ పేరిట కొత్త కారు తీసుకువచ్చింది. ఇది మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్. కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో మార్కెట్ టాపర్లకు ఇది గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. 

ఈ కారును ఇవాళే లాంచ్ చేశారు. ధరల శ్రేణి రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం కానుండడం, మధ్యతరగతి వారికి శుభవార్త అని చెప్పవచ్చు. మే 15 నుంచి ఈ కొత్త కారు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మహీంద్రా సంస్థ వెల్లడించింది. మే 26 నుంచి కారు డెలివరీలు షురూ అవుతాయి. 

స్లీక్ పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్ తో ఫ్రంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంటుంది. ఐవరీ కలర్ ఇంటీరియర్స్ తో కారు లోపలి భాగం రిచ్ గా కనిపిస్తుంది. సాఫ్ట్ టచ్ లెదర్ డాష్ బోర్డు, లెదర్ సీట్లు, స్టీరింగ్ పై లెదర్ కవర్, లెదర్ గేర్ నాబ్, లెదర్ ఫ్రంటర్ ఆర్మ్ రెస్ట్ తో ఈ కారుకు ప్రీమియం లుక్ వచ్చింది. 

ఎక్స్ యూవీ 3ఎక్స్ఓలో ఫార్వార్డ్ విజబిలిటీ యాంగిల్ 23.7 డిగ్రీలు... ఇంత వైడ్ యాంగిల్ విజబిలిటీ ఉన్న కాంపాక్ట్ ఎస్ యూవీ మరొకటి లేదు. తద్వారా ముందున్న రోడ్డును స్పష్టంగా చూసే వీలుంటుంది. 

స్పీడ్ తో పాటు సుపీరియర్ మైలేజ్ ఎఫిషియెన్సీ కోసం వరల్డ్ క్లాస్ ఎంస్టాలియన్ టీజీడీఐ టర్బో ఇంజిన్ ను ఇందులో పొందుపరిచారు. టీజీడీఐ సాయంతో ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే 60 కిలోమీటర్ల పికప్ అందుకుంటుంది. మైలేజి విషయానికొస్తే... మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లో ఇది ఒక లీటరుకు 20.1 కి.మీ పయనిస్తుందని ప్రచారంలో ఉంది. ఈ కారులో 6 స్పీడ్ ఏఐఎస్ఐఎన్ 3వ తరం ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా పొందుపరిచారు. 

ముఖ్యంగా, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ కారులో అత్యాధునిక సస్పెన్షన్ ఏర్పాటు చేశారు. మాక్ ఫెర్సన్ స్ట్రట్ ఫుల్లీ ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ సెమీ ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ తో ఎలాంటి రోడ్లపై అయినా కారు సాఫీగా సాగుతుందని మహీంద్రా చెబుతోంది. 

పనోరమిక్ స్కైరూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 65 వాట్ యూఎస్ బీ- సి పోర్ట్  చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 3 స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్, లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ ఈ కారులో ప్రత్యేకతలు. 

ఇందులో రెండు హెచ్ డీ స్క్రీన్లు ఉంటాయి. అందులో ఒకటి 26.03 సెంమీ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ కాగా, మరొకటి 26.03 సెంమీ ఫుల్ డిజిటల్ క్లస్టర్. 

మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓలో సేఫ్టీకి పెద్ద పీట వేశారు. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. బ్లైండ్ వ్యూ మానిటర్ తో కూడిన 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ హిల్ హోల్డ్, నాలుగు డిస్క్ బ్రేకులు, త్రీ పాయింట్  సీట్ బెల్టులు పొందుపరిచారు.

More Telugu News