V Srinivasa Prasad: కర్ణాటక బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
- గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస ప్రసాద్
- నాలుగు రోజులు బెంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స
- మార్చి 18న రాజకీయ జీవితం నుంచి రిటైర్మెంట్
బీజేపీ నేత, కర్ణాటకలోని చామరాజనగర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి. శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. 76 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్టు మార్చి 18న ఆయన ప్రకటించారు. అంతలోనే ఆయన మృతి చెందడం బీజేపీలో విషాదం నింపింది.
శ్రీనివాస ప్రసాద్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస ప్రసాద్ 1976లో జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1979లో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు జేడీఎస్, జేడీయూ, సమతా పార్టీలోనూ పనిచేశారు. 2017లో నంజన్‌గుడ్‌కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో చామరాజనగర్ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు.