pm modi: ఎక్కువగా కండోమ్ లు వాడేది ముస్లింలే: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi says Muslims Use Condoms Most Reply To PM Modi Jab

  • ఈ విషయాన్ని చెప్పేందుకు సిగ్గుపడట్లేదని వ్యాఖ్య
  • ప్రధాని మోదీ చేసిన ‘ఎక్కువ సంతానంగల వారు’ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ మండిపాటు
  • హిందువుల్లో ఇంకెంతకాలం భయం సృష్టిస్తారని నిలదీత
  • మతం వేరైనప్పటికీ తాము ఈ దేశానికి చెందిన వాళ్లమేనని స్పష్టీకరణ

ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కువ మంది సంతాపం ఉన్న వారికి, చొరబాటుదారులకు దేశ సంపదను తిరిగి పంచాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందంటూ మోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన విమర్శలను తప్పుబట్టారు.

‘ఎక్కువగా కండోమ్ లు ఉపయోగించేది ముస్లింలే’ అని ఆదివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు. ‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజల్లో ఎందుకు భయం సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా, సంతాన వృద్ధి తగ్గింది. ముస్లింలే ఎక్కువగా కండోమ్ లు వాడతారు. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు’ అని అసదుద్దీన్ అన్నారు.

ముస్లింలు జనాభాపరంగా మెజారిటీగా మారతారని నరేంద్ర మోదీ హిందువుల్లో భయం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలపై ఇంకెంత కాలం భయాన్ని వ్యాప్తి చేస్తారని నిలదీశారు. తమ మతం వేరైనప్పటికీ తాము ఈ దేశానికి చెందిన వాళ్లమని స్పష్టం చేశారు.

అధికార బీజేపీ చెబుతున్న మోదీ కీ గ్యారంటీ నినాదాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. దళితులు, ముస్లింలను ద్వేషించడమే మోదీ ఏకైక గ్యారంటీ అని చురకలంటించారు. అయితే ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ లేదా ప్రధాని మోదీ ఇంకా స్పందించలేదు. 

రాజస్తాన్ లోని బన్స్ వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. జాతీయ కుల సర్వేలో భాగంగా ఆర్థిక, వ్యవస్థీకృత నివేదిక కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రణాళికలను మోదీ ప్రస్తావించారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో జోడించారు. ‘కాంగ్రెస్ పార్టీ దేశంలోని తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారం ఎంతో లెక్కగడతామని అంటోంది. ఆ తర్వాత దాన్ని సమాజానికి తిరిగి పంపిణీ చేస్తామంటోంది. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశంలోని అన్ని వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందని చెప్పింది’ అంటూ ఆ సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

More Telugu News