CBSE Board Exams: ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు!

CBSE board exams likely to be conducted twice a year

  • 10, 12వ తరగతి పరీక్షలు ఏటా రెండు సార్లు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ కసరత్తు
  • అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక
  • ఈ విషయమై వచ్చే నెలలో పాఠశాలల ప్రిన్సిపాళ్లతో విద్యాశాఖ సమావేశం
  • వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలుకు యత్నం

వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే యెచన లేదని తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలో చర్చలు కూడా జరిపేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. 

కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ  విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరీ రంగన్ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని వర్తించాలని ప్రతిపాదించింది. 

ఈ విషయంపై గతేడాది అక్టోబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీబీఎస్‌ఈ విద్యార్థులు రెండు సార్లు  పరీక్షకు హాజరుకావడం తప్పనిసరేమీ కాదని అన్నారు. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే స్టూడెంట్స్‌ ఏడాదికి రెండు సార్లు పది, పన్నెండవ తరగతుల పరీక్షలు రాసే అవకాశం ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరవడం ఐచ్ఛికమని స్పష్టం చేశారు.

More Telugu News