G. Kishan Reddy: బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలు పాటించేది ఎవరో ప్రజలకు తెలుసు: కిషన్ రెడ్డి విమర్శలు
- బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- ఏఐసీసీ కాస్తా 'ఇటలీ నేషనల్ కాంగ్రెస్' పార్టీగా మారిందని ఎద్దేవా
- దేశంలోని అన్ని సమస్యలకు మూలకారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శ
బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండవని... రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారం చేస్తోందని, అసలు బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలను పాటించేది ఎవరో ప్రజలకు తెలుసునని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాస్తా 'ఇటలీ నేషనల్ కాంగ్రెస్' పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు.
అసలు దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అన్నారు. దేశానికి పట్టిన ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని ప్రజలు పదేళ్ల క్రితమే వదిలించుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఉండవని ప్రచారం చేయడం పిచ్చితనమే అన్నారు. కనీస పరిజ్ఞానం లేనివాళ్ళు రిజర్వేషన్లు రద్దవుతాయని మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు.