KCR: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది... భవిష్యత్తు మీది.. ఆలోచించండి: కేసీఆర్

KCR road show in Suryapet

  • బీజేపీ నుంచి నలుగురు ఎంపీలుగా గెలిచి ఒక్క రూపాయి పని చేశారా? అని ప్రశ్న
  • బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శ
  • భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయి బీఆర్ఎస్ చైర్మన్‌ను దించేశాయని ఆగ్రహం

'బీజేపీ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిస్తే ఒక్క రూపాయి పని అయినా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత. పార్లమెంట్‌లో ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలి' అని కేసీఆర్ అన్నారు.

సూర్యాపేట రోడ్డు షోలో కేసీఆర్‌ మాట్లాడుతూ... పదేళ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దళిత, పేద మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మోదీ పాలనలో రూపాయి డాలర్ మారకంతో 83కు పడిపోయిందన్నారు. ఒక పార్టీయేమో దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే... ఇంకో పార్టీయేమో ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెట్టుకొని ఓటు అడుగుతోందని ఎద్దేవా చేశారు. యాదాద్రి దేవాలయాన్ని నిర్మించిన మనం ఎప్పుడూ ఆ గుడిని చూపించి ఓటు అడగలేదన్నారు.

తాము ఎవరికో బీ టీమ్ అంటూ ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయని... కానీ భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయి బీఆర్ఎస్ చైర్మన్‌ను దించేశాయని మండిపడ్డారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే బీజేపీ అక్షితలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు అంటోందని... వీటితో కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు బోర్లకు మీటర్లు పెట్టమని హెచ్చరించినా తాను తలొగ్గలేదన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే కనుక మోటార్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు.

మోదీ అధికారంలోకి రాగానే ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పజెప్పారన్నారు. మోదీ లేకుండా, బీజేపీ లేకుండా కేంద్రంలో ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలంగాణకు మంచి లాభం జరిగేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు నష్టం జరిగింది బీజేపీ వల్లే అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News