Anil Kumble: ఐపీఎల్‌ ఆరంభ సీజ‌న్ వేలంలో.. త‌న‌ను విజ‌య్ మాల్యా ఎలా ద‌క్కించుకున్నాడో చెప్పిన‌ కుంబ్లే

Anil Kumble shares back story behind his trade to RCB in inaugural IPL season

  • ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ కోసం వేలానికి ముందు ఐకాన్ ప్లేయ‌ర్ల జాబితాలో కొంద‌రు ఆట‌గాళ్లు
  • ఈ జాబితాలో అనిల్ కుంబ్లేకు ద‌క్క‌ని చోటు
  • దాంతో వేలంలో పేరు న‌మోదు చేసుకున్న దిగ్గ‌జ క్రికెట‌ర్‌
  • కుంబ్లే తమ బెంగ‌ళూరు అబ్బాయనీ, అత‌డిని ఎవ్వ‌రూ తీసుకోవ‌ద్దని ప్రకటించిన ‌విజయ్ మాల్యా 
  • ఆ త‌ర్వాత క‌నీస ధ‌రకే కుంబ్లేను ఆర్‌సీబీ సొంతం చేసుకున్న వైనం 

భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌ ప్ర‌స్తావ‌న వ‌స్తే అందులో త‌ప్ప‌నిస‌రిగా అనిల్ కుంబ్లే పేరు ఉంటుంది. త‌న అద్భుత‌మైన ఆట తీరుతో టీమ్ఇండియాకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించాడు. టెస్టుల్లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. అలాగే భార‌త్ త‌ర‌ఫున‌ టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు (619) తీసిన రికార్డు కూడా అత‌డి పేరిటే ఉంది. ఇక 2008లో ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) కుంబ్లేను వేలంలో ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ వేలంలో ఆర్‌సీబీ య‌జ‌మాని విజ‌య్ మాల్యా త‌న‌ను ఎలా ద‌క్కించుకున్నాడు అనే విష‌యాన్ని తాజాగా కుంబ్లే తన యూట్యూబ్ ఛానెల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌తో స‌ర‌దాగా నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో వెల్ల‌డించాడు.    

ఈ సంద‌ర్భంగా అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. "ఆ స‌మ‌యంలో నేను టెస్టుల్లో భారత జ‌ట్టుకు సార‌ధిగా ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నాకు ఐపీఎల్‌ ఐకాన్ ఆట‌గాళ్ల‌ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. దాంతో నేను వేలంలో భాగమయ్యాను. ఇక నా పేరు వచ్చిన వెంటనే విజయ్ మాల్యా లేచి నిలబడి అతను నా బెంగుళూరు అబ్బాయి అని చెప్పినట్లు నాకు గుర్తుంది. అతడిని ఎవ‌రూ తీసుకోవ‌ద్దని చెప్పార‌ట‌. అత‌డు బెంగ‌ళూరు త‌ప్ప మ‌రెక్క‌డికీ వెళ్లడం లేద‌ని చెప్పాడ‌ట‌. దాంతో వేరే ఫ్రాంచైజీలు వ‌దులుకోవ‌డంతో క‌నీస ధ‌ర‌కే నన్ను ఆర్‌సీబీ కొనుగోలు చేసిన‌ట్లుగా గుర్తుంది" అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

కాగా, అనిల్ కుంబ్లే బెంగ‌ళూరుకు మూడేళ్లు ప్రాతినిధ్యం వ‌హించాడు. అలా మూడు ఐపీఎల్ సీజ‌న‌ల్లో 42 మ్యాచులాడిన ఈ దిగ్గ‌జ లెగ్‌ స్పిన్న‌ర్‌ 23.51 స‌గ‌టుతో 6.58 ఎకాన‌మీతో 45 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో ఆర్‌సీబీ దారుణంగా విఫ‌ల‌మైంది. 8 జ‌ట్లు పాల్గొన్న మొద‌టి సీజ‌న్‌లో బెంగ‌ళూరు ఏడో స్థానంతో స‌రిపెట్టుకుంది. కానీ, ఆ త‌ర్వాతి సీజ‌న్‌లో అద్భుతంగా పుంజుకున్న బెంగ‌ళూరు జ‌ట్టు ఏకంగా ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. అయితే, ఫైన‌ల్‌లో బోల్తా ప‌డింది. హైద‌రాబాద్ జ‌ట్టు డెక్క‌న్ ఛార్జ‌ర్స్ చేతిలో ప‌రాజ‌యంతో అడుగు దూరంలో టైటిట్ చేజార్చుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ ద‌క్క‌క‌పోవ‌డం గమ‌నార్హం.

  • Loading...

More Telugu News