Phone tapping: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

Phone tapping allegations against former CM Ashok Gehlot before the second phase of elections

  • ఆడియో క్లిప్స్ ఉన్న పెన్‌డ్రైవ్‌ను తనకు ఇచ్చారన్న మాజీ ఓఎస్డీ లోకేశ్ శర్మ
  • రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో సన్నిహితులకు గెహ్లాట్ రక్షణ కల్పించారని ఆరోపణ
  • రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు చిక్కుల్లో గెహ్లాట్‌
  • ఇంతవరకూ స్పందించని వైనం

లోక్‌సభ ఎన్నికలు-2024 రెండో దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన లోకేశ్ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్‌పై మాజీ సహాయకుడు లోకేశ్ శర్మ విమర్శలు గుప్పించారు. కొన్ని ఆడియో క్లిప్‌లతో కూడిన పెన్ డ్రైవ్‌ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు.

కాగా జులై 2020లో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆడియో సంభాషణలు లీక్ అయ్యి వైరల్‌గా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఈ ఆడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. 

కాగా ఆ ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసు కేసు నమోదయింది. అయితే ఈ విషయంపై గెహ్లాట్‌పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మరోవైపు 2022లో జరిగిన రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని లోకేశ్ శర్మ ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు.

  • Loading...

More Telugu News