Gujarat: సూరత్‌లో బీజేపీ ఏకగ్రీవం తర్వాత... కనిపించకుండా పోయిన కాంగ్రెస్ అభ్యర్థి

Congress Pick Missing 8 Others Withdraw
  • కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని ఫోన్‌లో కూడా అందుబాటులో లేరంటూ కథనాలు
  • నీలేశ్ కుంభాని బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం
  • సూరత్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరిన కాంగ్రెస్
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవమైన సంగతి విదితమే. కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ వేసిన మరో 8 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు.

అయితే నామినేషన్ తిరస్కరణ అనంతరం సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే, నీలేష్ కుంభాని బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో కుంభాని ఇంటి బయట 'ప్రజాద్రోహి' అని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. సూరత్ ఏకగ్రీవంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గుజరాత్ లో అధికారంలో వున్న బీజేపీ అనుచిత ప్రభావాన్ని చూపిందని, కాబట్టి ఇక్కడ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. 'సూరత్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాము. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరామ'ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు.
Gujarat
Lok Sabha Polls
BJP
Congress

More Telugu News