Sandeep Sharma: అప్పుడు అన్‌సోల్డ్.. ఇప్పుడు స్పెషలిస్ట్ బౌలర్.. ఐపీఎల్‌లో సందీప్ శర్మ అద్భుతమైన జర్నీ!
- నిన్నటి ముంబైతో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిసిన సందీప్ శర్మ
- ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్‌కు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మారిన 30 ఏళ్ల పేసర్
- ఇంతటి నైపుణ్యం కలిగిన ఆటగాడు గతంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని వైనం
జైపూర్ వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ సందీప్ శర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సందీప్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తొలుత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కీలకమైన బ్యాటర్లను ఔట్ చేసిన సందీప్, చివర్లో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గెరాల్డ్ ను పెవిలియన్‌కు పంపించాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్ఆర్‌కు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ మారాడు. అయితే, ఇంతటి నైపుణ్యం కలిగిన ఆటగాడు గతంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదంటే నమ్మకం కొంచెం కష్టం. కానీ, అదే జరిగింది. అవును మీరు విన్నది నిజమే.
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగిన వేలంలో సందీప్ శర్మ రూ. 50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్నాడు. అయితే, ఈ 30 ఏళ్ల పేసర్ ను కొనుగోలు చేయడానికి అప్పట్లో ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం. ఆఖరికి రాజస్థాన్ కూడా అతడిని కొనుగోలు చేయలేదు. కానీ, ఆ జట్టులోని ఓ ఆటగాడు గాయపడి పూర్తి సీజన్ కు దూరం అయ్యాడు. దాంతో ఆర్ఆర్ ఫ్రాంచైజీ సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంది. అలా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అతడు తుది జట్టులో కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ సీజన్లో 12 మ్యాచుల్లో 10 వికెట్లతో రాణించాడు.
ఆ సీజన్ నుంచే సందీప్ డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ జట్టుకు అవసరమైన కీలక సమయాలలో వికెట్లు పడగొట్టాడు. ఇక గాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ లకూ సందీప్ శర్మ దూరమయ్యాడు. దీంతో అతడి కెరీర్ ప్రమాదంలో పడుతుందనుకున్నారు. కానీ, ఆ తర్వాత త్వరగానే కోలుకుని తిరిగి జట్టులో చేరాడు. తాజాగా ముంబైతో మ్యాచ్ లో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తన 4 ఓవర్ల కోటాలో 4.50 ఎకానమీతో 18 పరుగులు మాత్రమే ఇచ్చి, కీలకమైన 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అందులోనూ ముంబై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయడం ద్వారా ఎంఐని కోలుకోని దెబ్బతీశాడు. కాగా, ఐపీఎల్ లో సందీప్ కు ఇదే తొలి 5 వికెట్ల ప్రదర్శన. దీంతో సందీప్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అంటూ పలువురు మాజీలు అతనిపై ప్రసంశలు కురిపిస్తున్నారు.