Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం
- మెడికల్ బోర్డు సూచనకు విరుద్ధంగా ఆహారం ఉందన్న కోర్టు
- ఢిల్లీ సీఎం ఆహారంలో బంగాళదుంపలు, చామదుంప, మామిడిపండ్లు ఉన్నాయన్న న్యాయస్థానం
- అలాంటి ఆహారాన్ని ఎలా అనుమతించారని తీహార్ జైలు అధికారులపై ఆగ్రహం
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి పంపిన ఆహారంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పంపిన ఆహారంలో బంగాళదుంప, చామదుంప, మామిడిపండ్లు ఉండకూడదని తమ వైద్యుడు సూచించినా పట్టించుకోలేదని, వాటిని ఆహారంలో చేర్చారని పేర్కొంది. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో లేని ఆహారాన్ని పంపితే ఎలా అనుమతించారని జైలు అధికారులను సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ప్రశ్నించారు.
మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ తన సుగర్ లెవల్స్ పెంచుకొని మెడికల్ బెయిలు పొందేందుకు జైలులో రోజూ మామిడిపండ్లు, ఆలూపూరీ, స్వీట్లు తింటున్నారని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంటి భోజనాన్ని అనుమతిస్తూనే, అది ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డు వైద్యుల సూచనకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తీహార్ జైలు అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. తమ ఫ్యామిలీ డాక్టర్‌తో రోజూ వీడియో కాల్‌ద్వారా కన్సల్టేషన్ ఉండేలా ఆదేశాలివ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.