Nara Lokesh: మంగళగిరి రూపురేఖలు మార్చడానికే వచ్చా: నారా లోకేశ్

Nara Lokesh met Continental Coffee workers

  • మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా లోకేశ్ ప్రచారం
  • దుగ్గిరాల మండలంలో కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో భేటీ
  • కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్ 

ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం...? మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం అంటూ నారా లోకేశ్ యువతకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.  

నారా లోకేశ్ ఇవాళ దుగ్గిరాల మండలం మంచికలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటు విషయంలో మెరుగైన పాలసీ తీసుకువస్తామని చెప్పారు. 

"ఒక్క పరిశ్రమ వస్తే అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకువస్తే.. దానికి అనుబంధంగా వందలాది పరిశ్రమలు వచ్చాయి. దీంతో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. నేడు ఒక్క కియా పరిశ్రమ వల్లే అనంతపురం ప్రజల తలసరి ఆదాయం రూ.30 వేలు పెరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. 

మంగళగిరిలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. అందుకు అనుగుణంగా పనిచేస్తాం. పరిశ్రమల ఏర్పాటు ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇందుకోసం రెడ్ కార్పెట్ వేసి ఆయా పరిశ్రమలను ఆహ్వానించాలి. దుగ్గిరాలకు కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్ కోసం రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. మంగళగిరి రూపురేఖలు మార్చడానికే నేను వచ్చా. 

జగన్ అమరావతి పనులు కొనసాగించి ఉంటే, యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఆనాడు హైదరాబాద్ లో చంద్రబాబునాయుడు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు... "కంప్యూటర్లు అన్నం పెడతాయా?" అని హేళన చేశారు. నేడు 15 లక్షల మంది ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

అదేవిధంగా గ్రామాల్లో సమస్యలను కూడా పరిష్కరించాలి. ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైయిన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పన్నుల భారంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు మన రాష్ట్రాన్ని, మన అసెంబ్లీ నియోజకవర్గాన్ని, మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయండి" అని లోకేశ్ పిలుపునిచ్చారు. 

మంగళగిరిలో తనను గెలిపించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ సంకల్పం అని లోకేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ కూడా సంస్థను విస్తరించి, అదనపు ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని లోకేశ్ కోరారు. 

కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఎక్కువ ఉద్యోగాలిచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, అవసరమైన అన్ని సహాయ, సహకారాలు రాబోయే ప్రజాప్రభుత్వంలో తాము అందిస్తామని లోకేశ్ చెప్పారు.

  • Loading...

More Telugu News