Sandeep Sharma: ముంబయి ఇండియన్స్ ని హడలెత్తించిన సందీప్ శర్మ
- ఐపీఎల్ లో నేడు ముంబయి వర్సెస్ రాజస్థాన్
- టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు
- రాణించిన తిలక్ వర్మ, వధేరా
- 5 వికెట్లు తీసిన సందీప్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ మీడియం పేసర్ సందీప్ శర్మ ధాటికి ముంబయి ఇండియన్స్ కకావికలం కాగా... తెలుగుతేజం తిలక్ వర్మ, నేహాల్ వధేరా రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సందీప్ శర్మ 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
ముంబయి ఇండియన్స్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 6 పరుగులకే అవుట్ కాగా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (10) కూడా విఫలమయ్యాడు. మహ్మద్ నబీ (17 బంతుల్లో 23) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా, చహల్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ దశలో తిలక్ వర్మ, వధేరా జోడీ అద్భుతంగా ఆడి ముంబయి స్కోరును ముందుకు నడిపించింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 99 పరుగులు జోడించి ముంబయికి గౌరవప్రదమైన స్కోరును అందించారు. తిలక్ వర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. వధేరా 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 49 పరుగులు సాధించాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా 10 పరుగులకే వెనుదిరగ్గా, టిమ్ డేవిడ్ (3) సైతం అదే బాటలో నడిచాడు. చివర్లో 7 పరుగుల తేడాతో 4 వికెట్లు చేజార్చుకున్న ముంబయి పెద్దగా పరుగులు చేయలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5, ట్రెంట్ బౌల్ట్ 2, అవేష్ ఖాన్ 1, చహల్ 1 వికెట్ తీశారు.