Raghunandan Rao: మరికొన్ని రోజుల్లోనే కేసీఆర్ ఇంట్లోని మరికొందరు జైలుకు వెళతారు: రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

Raghunandan Rao says kcr family members went to jail

  • 1985 లో కేసీఆర్ గెలిచినప్పటి నుంచి సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శ
  • దుబ్బాకలో రఘునందన్ ఓడిపోవడం ఎంత నిజమో... కామారెడ్డిలో కేసీఆర్‌ను బీజేపీ ఓడించింది అంతే నిజమని వ్యాఖ్య
  • తెలంగాణలో ఆడవాళ్లు అయితే లిక్కర్ దందా నడపరని విమర్శ
  • హరీశ్ రావు గేటుపై నిలుచున్నారు... కాంగ్రెస్‌లోకి వెళతారా? లేక బీఆర్ఎస్‌లో ఉంటారా? తెలియదని వ్యాఖ్య

మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో కేసీఆర్ ఇంట్లోని కొందరు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. శుక్రవారం నంగునూర్ మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారంలో మాట్లాడుతూ... 1985లో కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సిద్దిపేటలో ఈ నాలుగు దశాబ్దాలుగా కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరరావు అని అంటారని... కానీ నంగునూర్‌లో ఒక్క చెరువులో నీళ్లు లేవన్నారు.

తాను దుబ్బాకలో ఓడిపోయానని చెబుతారని... మరి ఈ రఘునందన్ రావు ఇక్కడ ఓడిపోవడం ఎంత నిజమో.. కామారెడ్డిలో కేసీఆర్‌ను బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమని చురక అంటించారు. ఈ ఎన్నికలు కవితను తీహార్ జైలు నుంచి బయటకు తీసుకువచ్చే ఎన్నికలు కాదని స్పష్టం చేశారు. అసలు తెలంగాణలో ఆడవాళ్లు లిక్కర్ దందా నడపరని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గేటుపై నిలుచున్నారని, ఆయన కాంగ్రెస్‌లోకి వెళతారా? లేక అందులోనే (బీఆర్ఎస్) ఉంటారా మాత్రం తెలియదని ఎద్దేవా చేశారు.

రూ.1600 కోట్లతో సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు కేంద్ర నిధులతో రోడ్డు పనులు సాగుతున్నాయన్నారు. మరో ఐదేళ్లు ఉచిత రేషన్ అందిస్తామన్నారు. రేవంత్ రెడ్డి గెలిచి నాలుగు నెలలు అయినా రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? లేదా ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? చెప్పాలని నిలదీశారు. ప్రధాని మోదీ రైతులకు సబ్సిడీతో ఎరువుల బస్తాలు అందించారన్నారు.

  • Loading...

More Telugu News