MS Dhoni: వాంఖడేలో అభిమానికి బంతిని గిఫ్ట్‌గా ఇచ్చిన ధోనీ..!
![MS Dhoni displays heartwarming gesture after blistering cameo gifts match ball to fan at Wankhede](https://imgd.ap7am.com/thumbnail/cr-20240415tn661ce16e3bb77.jpg)
- డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ తన చేతిలోని బంతిని స్టాండ్స్‌లో ఉన్న యువతికి అందించిన ఎంఎస్‌డీ
- వాంఖడే స్టేడియంలో ముంబైతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో మాజీ కెప్టెన్ ఊచకోత
- 4 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 పరుగులు చేసిన ఎంఎస్ ధోనీ
- ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ను కొనియాడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాట్ ఝళిపించిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లతో బౌలర్ హార్దిక్ పాండ్యాను బెంబేలెత్తించాడు. దీంతో సీఎస్‌కే జట్టు అలవొకగా 200 పరుగుల మైలురాయిని దాటింది. ముంబైకి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ టార్గెట్‌ను ఛేదించలేక ఎంఐ చతికిలపడింది.
ఇలా మెరుపు ఇన్నింగ్స్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే సమయంలో ధోనీ చేసిన ఒక పనిపై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతున్న సమయంలో ఓ యువ అభిమానికి ధోనీ మ్యాచ్‌లో వినియోగించిన బంతిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. మెట్లపై నడిచి వెళ్తున్న ధోనీ తన చేతిలోని బంతిని స్టాండ్స్‌లో ఉన్న ఓ యువతికి దాన్ని అందించాడు. ఇక ముంబై ఇండియన్స్ ఛేదనకు దిగిన సమయంలోనూ వికెట్ల వెనక ఎంఎస్‌డీ మరోసారి తనదైన శైలిలో కీపింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయసులోనూ 21 ఏళ్ల కుర్రాడిలా మెరుపు వేగంతో కీపింగ్ చేశాడు.
ఇక ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావొచ్చనే కారణంతో సీఎస్‌కే ఎక్కడ ఆడినా అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రత్యేకంగా ధోనీ బ్యాటింగ్‌కు దిగాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. తమ కోసం చివరలో నాలుగు బంతులు ఆడినా పర్లేదు. కానీ, కెప్టెన్ కూల్ క్రీజులో బ్యాట్‌తో కనబడితే చాలు అని అభిమానులు అంటున్నారు.