Sarabjit Singh: సరబ్‌జీత్‌సింగ్‌పై పాక్ జైలులో దాడిచేసిన అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ కాల్చివేత
- గూఢచర్యం ఆరోపణలపై పాక్ జైలులో మగ్గిపోయిన సరబ్‌జీత్‌సింగ్
- 23 ఏళ్లపాటు జైలులోనే మగ్గిపోయిన సరబ్‌జీత్
- 2013లో జైలులోనే ఆయనపై ఇటుకలతో ఆమిర్ సర్ఫరాజ్ దాడి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో సరబ్‌జీత్ మృతి
- తాజాగా లాహోర్‌లో సర్ఫరాజ్‌ను కాల్చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయి పాక్ జైలులో ఉంటున్న భారత్‌లోని పంజాబ్‌కు చెందిన సరబ్‌జీత్‌సింగ్(49)పై దాడిచేసిన అండర్ వరల్డ్ డాన్ ఆమిర్ సర్ఫరాజ్ దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తుపాకితో కాల్చి చంపారు.
గూఢచర్యం ఆరోపణలపై 1990లో పాకిస్థాన్ అధికారులు సరబ్‌జీత్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై వచ్చిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ 23 ఏళ్లపాటు ఆయన జైలులోనే మగ్గిపోయాడు. అఫ్జల్‌గురును భారత్‌లో ఉరి తీసిన తర్వాత మే 2013లో లాహోర్‌లోని కోట్‌లక్పత్ జైలులో ఉన్న సరబ్‌జీత్‌పై అదే జైలులో ఉన్న సర్ఫరాజ్ మరికొందరు ఖైదీలతో కలిసి ఇటుకలతో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన ఆయనను లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సరబ్‌జీత్ గుండెపోటుతో మరణించాడు. తాజాగా, సర్ఫరాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి అంతమొందించారు.