Mumbai Indians: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ!

An unexpected setback for Chennai Super Kings before the match against Mumbai Indians

  • స్టార్ పేసర్ మతీశ పతిరన ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశం
  • సంకేతాలిచ్చిన ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్
  • పతిరన గాయం తీవ్రత తగ్గిందని వెల్లడి

ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌లో తలపడడానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ పేసర్ మతీశ పతిరన దూరమయ్యే అవకాశాలున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంకేతాలు ఇచ్చాడు. గాయం తీవ్రత తగ్గినప్పటికీ ఆడే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్టీఫెన్ మాట్లాడుతూ.. ముంబైతో మ్యాచ్‌లో పతిరన ఆడతాడనే ఆశాభావంతో ఉన్నామని, అయితే అతడు 100 శాతం ఫామ్‌లో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముంబైతో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినా మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నామని చెప్పారు. మతీశ పతిరన ప్రాధాన్యత తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్,  కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ల్లో పతిరన అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. 

ఇక నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గైక్వాడ్, ధోనీల మధ్య పెద్దగా తేడా లేదని, గైక్వాడ్ కూడా కూల్‌గా ఉంటున్నాడని మెచ్చుకున్నాడు. కాగా నేడు (ఆదివారం) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు జరగగా చెన్నై 16, ముంబై 20 మ్యాచ్‌ల్లో  విజయాలు సాధించాయి.

చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా మూడు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 3వ స్థానంలో నిలిచింది. తన చివరి మ్యాచ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూసింది.

  • Loading...

More Telugu News