YS Sharmila: అవినాశ్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నారు: షర్మిల
- కడపలో తాను ప్రచారాన్ని ప్రారంభించి నాలుగైదు రోజులే అయిందన్న షర్మిల
- అవినాశ్ ను మారుస్తున్నారనే వార్తలు వస్తున్నాయని వ్యాఖ్య
- అవినాశ్ హత్య చేశాడని ఒప్పుకుంటున్నట్టేనా అని ప్రశ్న
కడప ఎంపీ అభ్యర్థిగా తాను ప్రచారం చేయడాన్ని ప్రారంభించి కేవలం నాలుగైదు రోజులు మాత్రమే అయిందని... ఈ నాలుగైదు రోజుల్లోనే వైసీపీలో చాలా మార్పు వచ్చిందని... వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని మార్చబోతున్నారని, ఆయన స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయని వైఎస్ షర్మిల అన్నారు. అవినాశ్ ను మార్చాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటే... వివేకాను అవినాశ్ హత్య చేశాడని మీరు ఒప్పుకుంటున్నట్టేనా? సీబీఐ చెపుతున్నది నిజమే అని ఒప్పుకుంటున్నట్టేనా? అందుకే కడప స్థానం నుంచి అవినాశ్ ను మారుస్తున్నారా? అని ప్రశ్నించారు.
అవినాశ్ హత్య చేశాడని ప్రజలు నమ్ముతున్నారు, అవినాశ్ కు ఓట్లు వేయరు, ఆయన ఓడిపోతాడు అని మీరు నమ్ముతున్నారు కాబట్టే... అవినాశ్ ను మారుస్తున్నారా? అని అడుగుతున్నానని షర్మిల అన్నారు. కడప అభ్యర్థి అవినాశ్ అయినా, మరెవరైనా సరే... హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారనే ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. వివేకా ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే... సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చిత్రీకరించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా చనిపోయినప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్... సీఎం అయిన తర్వాత మాట మార్చారని... తాను సీబీఐ ఎంక్వైరీకి పోతే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని సునీతకు ఎందుకు చెప్పారో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.