Delhi Liquor Scam: అందరి బండారం బయటపెడతా: తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల

Sukesh Chandrasekher releases letter from thihar jail

  • కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని వెల్లడి
  • తీహార్ జైల్లో తమకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చారని ఆరోపణ
  • ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వవద్దని ఢిల్లీ మంత్రి తనను బెదిరిస్తున్నారన్న సుఖేశ్
  • ఎవరు బెదిరించినా... నేతల బండారం బయటపెడతానని హెచ్చరిక

తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ముగ్గురు జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. సత్యేంద్ర జైన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించారన్నారు. జైలు అధికారి రావత్ తనను బెదిరించారని ఆరోపించారు. మూడు రోజులుగా జైళ్ల శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వవద్దని తనపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. అయినప్పటికీ ఎవరు బెదిరించినా... భయపెట్టినా నేతల బండారం బయటపెడతానని లేఖలో పేర్కొన్నారు.

34 ఏళ్ల సుఖేశ్ చంద్రశేఖర్ బెంగళూరువాసి. మద్యం కేసులో రాజకీయ నాయకులతో పాటు సుఖేశ్ చంద్రశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కొడుకుని అని, పీఎంవో అధికారిని అంటూ, సుప్రీంకోర్టు జడ్జిని అంటూ నమ్మించి రూ.200 కోట్లు మోసం చేసిన కేసులో సుఖేశ్ అరెస్టయ్యాడు. అతనిపై 15కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అతను జైల్లో ఉన్నాడు. గతంలోనూ ఆయన జైలు నుంచి లేఖ విడుదల చేశాడు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ అంటూ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు.

More Telugu News