Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కు సోనూ సూద్ అండ.. రెండుగా విడిపోయిన నెటిజన్లు!
- డెలివరీకి వచ్చి ఇంటిముందున్న షూ చోరీ చేసిన స్విగ్గీ బాయ్
- అతడిపై చర్యలు తీసుకోవద్దని సంస్థకు, అధికారులకు సోనూ విన్నపం
- కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు దుమ్మెత్తి పోస్తున్న వైనం
- దొంగతనం ఏ రూపంలో ఉన్నా సమర్థించడం సరికాదని హితవు
కరోనా కష్టకాలంలో వేలాదిమందిని ఆదుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఆ తర్వాత కూడా ఎంతోమందిని ఆదుకున్నాడు. సాయం కోరినవారిని లేదనకుండా అక్కున చేర్చుకున్న అతడి మంచి హృదయానికి దేశం మొత్తం ఫిదా అయింది. తాజాగా ఆయన పేరు మరోమారు హెడ్‌లైన్స్‌కు ఎక్కింది. ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్ వీడియో రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ డెలవరీ బాయ్‌కు సోనూ సూద్ ఇప్పుడు అండగా నిలిచాడు. బూట్లు చోరీ చేసిన అతడిపై కంపెనీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరాడు.
‘‘స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ సమయంలో ఎవరివైనా షూ చోరీ చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవడానికి బదులుగా కొత్త షూ కొనివ్వండి. అతడికి అవి అవసరం కావొచ్చు. కాబట్టి దయగా ఉండండి’’ అని ఎక్స్ చేశాడు. సోనూ సోద్ చేసిన ఈ సూచనపై నెటిజన్లు రెండుగా విడిపోయి కామెంట్లు చేస్తున్నారు.
కొందరు నటుడిని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం దొంగతనం ఏ రూపంలో ఉన్నా అది మంచిది కాదని అంటున్నారు. అతడిపై చర్యలు తీసుకోవద్దని చెప్పడం వరకు ఓకే కానీ, ఇలాంటి జస్టిఫికేషన్‌లు ఇవ్వడం సరికాదని మరికొందరు మండిపడుతున్నారు. పేదరికం, అవసరాలు కారణంగా చేసే చోరీని సమర్థించడం సరికాదని చెబుతున్నారు. ఈ డెలివరీ బాయ్ కంటే కూడా లక్షలాదిమంది ప్రజలు పేదలుగా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. బతకడానికి మరింతగా కష్టపడాలని, అంతేకానీ, దొంగతనం కూడదని కామెంట్లు పెడుతున్నారు.