YS Sharmila: వీళ్లకు భరోసా కల్పించలేకపోతే మనం బంధువులం అయ్యుండి ఏం లాభం?: షర్మిల
- పులివెందులలో కాంగ్రెస్ సభ
- సభ ప్రారంభంలో ఆరిపోయిన లైట్లు
- అవినాశ్ రెడ్డి ఓటమి భయంతో వణికిపోతున్నాడన్న షర్మిల
- వివేకా హత్య జరిగి ఐదేళ్లయినా న్యాయం జరగలేదని వెల్లడి
- చిన్నమ్మ, సునీత ఎంతో నష్టపోయారంటూ వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు స్థానం అభ్యర్థి వైఎస్ షర్మిల పులవెందుల సభకు హాజరయ్యారు. పులివెందుల పూల అంగళ్లు సెంటర్ లో ఈ సభ ఏర్పాటు చేశారు. అయితే సభ ప్రారంభంలో లైట్లు ఆరిపోవడంతో షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు. మామూలుగానే లైట్లు ఉండవు అంటే సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టు... మేం వస్తున్నామని లైట్లు తీశారు అంటే అవినాశ్ రెడ్డి భయంతో వణికిపోతూ ఓటమిని ఒప్పుకున్నట్టు అని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజలను కొంగు చాచి అడుతున్నా... న్యాయం చేయండి అని విజ్ఞప్తి చేశారు.
అవినాశ్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి మార్చుతున్నట్టు తెలుస్తోందని, అలా మార్చితే వివేకాను చంపించింది అవినాశే అని జగన్ నమ్మినట్టే కదా అని షర్మిల పేర్కొన్నారు.
ఇక, తాను ఎవరికీ భయపడే దాన్ని కాదని... పులి కడుపున పులే పుడుతుందని స్పష్టం చేశారు. జగనన్న జైలుకు వెళితే 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని వెల్లడించారు. ఎండనక, వాననక... ఇంట్లో బిడ్డలను, కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి పాదయాత్ర చేశానని వివరించారు. ఒక సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశానని... ఏం చేసినా నా అన్న కోసమే చేశానన్న తృప్తితో చేశానని తెలిపారు.
జగనన్న సీఎం అయితే మళ్లీ రాజశేఖర్ రెడ్డి వదిలి వెళ్లిన అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని, అభివృద్ధి జరుగుతుందని నమ్మానని షర్మిల పేర్కొన్నారు.
"జగనన్న ఏం చేయమంటే అది చేశాను, సమైక్యాంధ్ర కోసం యాత్ర చేయమంటే చేశాను, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాను, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు... బై బై బాబు ప్రచారం కూడా నడిపాను. జగనన్న ముఖ్యమంత్రి అయ్యేంతవరకు నేను ఆయన చెల్లెలిని కాను... బిడ్డను. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక... ఆ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నన్ను గుర్తుపట్టలేదు! నాకు పరిచయం లేని వ్యక్తి ఆయన!
ఆ తర్వాత కాలంలో కడప జిల్లా అంతా బాధితులే అయ్యారు. ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ, సునీత. అలాంటి సమయంలో బాధితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఒక్కటే నాపై ఉందని ఆలోచించాను. వీళ్లకు భరోసా కల్పించలేకపోతే మనం బంధువులం అయ్యుండి ఏం లాభం? రక్తసంబంధం ఉండి ఏం లాభం?
రాముడికి లక్ష్మణుడు ఎలాగో... రాజశేఖర్ రెడ్డికి వివేకా అలాగ. కానీ, ఇవాళ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు. సాక్ష్యాధారాలతో సహా హంతకులు ఎవరో, చేయించింది ఎవరో సీబీఐ చెబుతోంది.
జగనన్నను సూటిగా ప్రశ్నిస్తున్నా... ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎందుకు ఓటేశారు? వీటికి సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా తెస్తానని మీరు మాటిస్తే, ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తే, ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేద్దాం అని మీరు చంద్రబాబుకు సవాల్ విసిరితే... మిమ్మల్ని నమ్మి జనం ఓట్లేశారు... వచ్చిందా ప్రత్యేక హోదా అని అడుగుతున్నా!
ముఖ్యమంత్రి అయి ఐదేళ్లయింది... పులివెందుల పులి అన్నారు. కానీ ఇదే జగన్ బీజేపీ, మోదీ ముందు పిల్లిలా మారారు. మీరు బీజేపీకి ఎందుకు బానిస అయ్యారు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి హోదాలో ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా మీరు?
పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ప్రియమైనది. అదొక్కటే కాదు... అనేక ప్రాజెక్టులు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. పులివెందుల బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని కట్టలేదంటే అవమానం కాదా! కుంభకర్ణుడు కూడా ఆరు నెలలే నిద్రపోతాడు. జగన్ తాను కట్టుకున్న కోటలో నిద్రపోతూనే ఉన్నాడు" అంటూ షర్మిల ధ్వజమెత్తారు.