BRS: ఉత్కంఠకు తెర... వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
- మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ప్రకటించిన కేసీఆర్
- ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సుధీర్ కుమార్
- వరంగల్ లోక్ సభ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న రాజయ్య
- నియోజకవర్గ నాయకులతో చర్చించిన అనంతరం సుధీర్ కుమార్‌కు టిక్కెట్
వరంగల్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మారేపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ నాయకులతో సుదీర్ఘ భేటీ అనంతరం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. వరంగల్ లోక్ సభ సీటును డాక్టర్ రాజయ్యకు ఇస్తారనే ప్రచారం సాగింది. ఆయనకు కేసీఆర్ నుంచి పిలుపు కూడా వచ్చింది. కానీ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు.
వరంగల్ లోక్ సభ నియోజకవర్గం, జిల్లా నేతలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈరోజు కేసీఆర్ పిలుపుతో సమావేశానికి హాజరయ్యారు. చివరి నిమిషం వరకు అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ కొనసాగింది. రాజయ్య కూడా టిక్కెట్‍పై ఆశలు పెట్టుకున్నారు.
ఎవరీ సుధీర్ కుమార్?
హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ ను సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్... సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.