Gujarat: హిందువులు బౌద్ధంలోకి మారేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి: గుజరాత్ ప్రభుత్వం
- రాష్ట్ర చట్టాల ప్రకారం బౌద్ధం ప్రత్యేక మతమని పేర్కొన్న గుజరాత్ ప్రభుత్వం
- బౌద్ధంలోకి మారే హిందువులు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ
- జైన, సిక్కు మతాలకూ ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రకటన
హిందూమతం, బౌద్ధం వేర్వేరని గుజరాత్ ప్రభుత్వం తాజాగా పేర్కొంది. హిందువులు బౌద్ధంలోకి మారేందుకు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ ఓ సర్క్యులర్ జారీ చేసింది. బౌద్ధం, హిందూమతం, సిక్కుమతం, జైనమతంలోకి మారాలంటే రాష్ట్ర మతస్వేచ్ఛ చట్టం ప్రకారం ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
బౌద్ధం మతంలోకి మారే సందర్భంలో నిబంధనలు సరిగా పాటించడంలేదన్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. దసరా సందర్భంగా అనేక మంది బౌధ్ధంలోకి మారుతుంటారని, వీరిలో చాలా మంది మతమార్పిడికి సంబంధించి ముందస్తు అనుమతులు అవసరం లేదని భావిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. రాష్ట్రంలోని చట్టాల ప్రకారం బౌద్ధం కూడా ఓ ప్రత్యేక మతం కాబట్టి బౌద్ధం, జైనం లేదా సిక్కుమతంలోకి మారే హిందువులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. అధికారులు చెప్పిన విధానంలో ప్రజలు తమ సమాచారాన్ని సమర్పించాలని వెల్లడించింది.