Model School: తోటి ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక.. మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్యాయత్నం
- వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో ఘటన
- దోమల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నం
- ఉపాధ్యాయులందరూ ఒక్కటై తనను వేధిస్తున్నారని ఆరోపణ
- స్కూల్‌ను సందర్శించి వివరాలు సేకరించిన మండల విద్యాశాఖాధికారులు
సహచర ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు యత్నించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్ స్కూల్లో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పాఠశాల మాజీ ప్రిన్సిపాల్, టీజీటీ సివిక్స్ ఉపాధ్యాయుడు రాజేందర్, తోటి ఉపాధ్యాయులు డి.రాజు, మౌలాలి, సోషల్ ఉపాధ్యాయురాలు ఓ బృందంగా ఏర్పడి బాధిత ఉపాధ్యాయురాలు హారికను వేధించడం మొదలుపెట్టారు.
తనను అసభ్యకరంగా ఫొటోలు తీసిన రాజేందర్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నట్టు హారిక మీడియాకు తెలిపారు. రాజేందర్ వేధింపులపై గతంలోనూ పలువురు మహిళా టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని, అయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి ఉపాధ్యాయులతో కలిసి తనను వేధించడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో నిన్న దోమల నివారణ మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. బాధిత ఉపాధ్యాయురాలి ఆరోపణల నేపథ్యంలో మండల విద్యాశాఖ నోడల్ అధికారి స్కూల్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. రాజేందర్ మాత్రం తనపై హారిక చేసిన ఆరోపణలు కొట్టిపడేశారు.