వేప పువ్వు: ఉగాది పండక్కి వేప పువ్వేదీ?

No neem flower for Ugadi festival

  • పచ్చడి తయారీలో వేప పువ్వు ఉండాల్సిందే..
  • ఈసారి ఇంకా పూత రాని వేప చెట్లు
  • గతంలో వచ్చిన తెగుళ్లు, వాతావరణ మార్పులే కారణం అంటున్న నిపుణులు

తెలుగువారికి ఉగాది ఎంతో ప్రియమైన పండుగ. ఈ రోజున షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడి మరింత ప్రత్యేకం. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు రుచుల సమాగమం అది. ఇందులో చేదు కోసం వేప పువ్వు కలపడం తప్పనిసరి. కానీ వాతావరణ మార్పులు, పలు ఇతర కారణాలతో ఈసారి వేప పువ్వు జాడ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా తప్ప.. చాలా చోట్ల వేప పువ్వు కనిపించడం లేదు.

ఏదీ వేప పువ్వు?
వేసవి కాలం మొదలయ్యే సమయంలో.. చెట్లన్నీ ఆకులు రాల్చి కొత్త చిగురు వేస్తుంటాయి. వేప చెట్లు కూడా కొత్త ఆకులతోపాటు పువ్వునూ సంతరించుకుంటాయి. ఉగాది నాటికి కళకళలాడుతుంటాయి. కానీ ఈసారి ఉగాది వచ్చినా.. వేప చెట్లు ఇంకా కొత్త చిగుళ్లు సంతరించుకోలేదు. పువ్వు ఎక్కడా పూయలేదు. దీనితో ఉగాది పచ్చడిలోకి వేప పువ్వు ఎలాగనే ఆందోళన కనిపిస్తోంది. 

కారణాలేమిటి?
గత రెండేళ్లలో వేప చెట్లకు శిలీంధ్రాలు సోకాయి. దానితో చాలా వరకు వేప చెట్లు మోడులా మారాయి. కానీ తర్వాత చిగురించాయి. 2023 ఉగాది నాటికి వేపచెట్లు కొంత మేర కళ సంతరించుకున్నాయి. ఆ ఏడాది మార్చి 22వ తేదీనే ఉగాది వచ్చింది. అప్పటికే పువ్వు పూసింది కూడా. ఈసారి అంతకు 15 రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 9న ఉగాది వచ్చినా.. వేప పువ్వు మాత్రం జాడ లేదు. అయితే ప్రస్తుతం మూడు నెలలుగా వర్షాల జాడ లేకపోవడం, ఉష్ణోగ్రతలు కూడా పరిమితికి మించి నమోదవుతుండటంతో.. వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే వేప పూత మొదలవలేదని అంటున్నారు.

More Telugu News