Chandragiri ycp: టీడీపీలో చేరిన తిరుపతి జిల్లా కీలక నేతలు.. వైసీపీకి షాక్

chandragiri ycp leaders joins telugu desham party
  • చంద్రగిరిలో అధికార పార్టీకి వరుస ఎదురుదెబ్బలు
  • పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి నడిచిన నేతలు
  • చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన కీలక నేతలు ప్రస్తుతం వైసీపీని వీడుతున్నారు. పార్టీ అధినేత తీరుతో పాటు రాష్ట్రంలో మారిన పరిస్థితుల వల్ల వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా పాకాల జడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త రమణమూర్తి, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ముడిపల్లి సురేష్‌రెడ్డి తదితరులు టీడీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పాకాల జడ్పీటీసీ పద్మజారెడ్డితోపాటు ఆమె భర్త వైసీపీ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబురెడ్డి కూడా పార్టీ మారారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు దక్కడంలేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల కుటుంబ పాలన ఎక్కువైందని, ఎమ్మెల్యే పీఏ, పీఆర్వోల పెత్తనం పెరిగిపోయిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహాలుగా మారిపోవాల్సి వస్తోందని పద్మజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రొటోకాల్ మర్యాదలకూ తాము నోచుకోలేదని, ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేసేందుకు వీలు కలగలేదని పద్మజారెడ్డి వాపోయారు.
Chandragiri ycp
ycp leaders
TDP
tirupati
joinings in TDP

More Telugu News