Nalgonda District: నల్గొండ మున్సిపాలిటీ ట్యాంకులో పడి 30 కోతుల మృతి.. నల్గొండ జిల్లాలో ఘటన

30 monkeys found dead in water tank in Telangana
  • నీరు తాగడానికి వచ్చి ట్యాంకులో చిక్కుకుని చనిపోయి ఉంటాయంటున్న అధికారులు
  • పది రోజుల క్రితమే అవి మరణించి ఉండొచ్చన్న స్థానికులు 
  • ట్యాంకుతో స్థానిక తాగునీటి అవసరాలు  తీరుతుండటంతో ప్రజల్లో ఆందోళన
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఓ నీటి ట్యాంకులో 30 వానరాలు పడి మృతి చెందిన విషయాన్ని అధికారులు బుధవారం గుర్తించారు. కొన్ని రోజుల క్రితమే అవి మరణించినట్టు సమాచారం. కోతుల కళేబరాలను మున్సిపల్ సిబ్బంది వెలికితీశారు. హిల్ కాలనీ సమీపంలోని 200 కుటుంబాలకు ఈ ట్యాంకు ద్వారా తాగు నీటి సరఫరా జరుగుతోంది. దీంతో, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాంకులో ఏదీ పడకుండా అధికారులు గతంలో మెటల్ షీట్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఎండలు మండిపోతుండటంతో కోతులు దాహాన్ని తట్టుకోలేక షీట్స్‌ను తప్పించి ట్యాంకులోకి దిగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మళ్లీ బయటకు రాలేక అందులోనే పడి మృతి చెంది ఉంటాయని అంటున్నారు. 

ట్యాంకులో భారీ సంఖ్యలో కోతుల కళేబరాలు బయటపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితమే అవి మరణించి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆ నీరు తాగుతుండడం వల్ల తమ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Nalgonda District
Telangana
Muncipality
Monkeys

More Telugu News