KTR: రేవంత్‌రెడ్డి ఢిల్లీకి రూ. 2500 కోట్లు పంపారన్న వ్యాఖ్యల నేపథ్యంలో.. కేటీఆర్ పై బంజారాహిల్స్‌లోనూ కేసు నమోదు!
- కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రేవంత్ డబ్బులు వసూలు చేసి అధిష్ఠానానికి పంపారని కేటీఆర్ ఆరోపణలు
- నిన్న హన్మకొండలో కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ శ్రేణులు
- తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి బలవంతంగా రూ. 2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ శ్రేణులు నిన్న హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న కేటీఆర్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు.
తాజాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక, నిన్న హన్మకొండలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దానిని బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు.