IPL 2024: ధోనీ అభిమాని త‌ల ప‌గ‌ల‌గొట్టిన రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్!

Rohit Sharma Fans Attack on MS Dhoni Fan in Maharashtra

  • అభిమానుల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఈ నెల 27న జ‌రిగిన ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌
  • మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ధోనీ, రోహిత్ శర్మ‌ అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌
  • రోహిత్ శ‌ర్మ వికెట్ ప‌డిన స‌మ‌యంలో ధోనీ అభిమాని హేళ‌న‌  
  • దాంతో ఘర్ష‌ణ‌కు దిగిన హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌.. ఒక‌రి ప‌రిస్థితి విష‌మం
  • మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో ఘ‌ట‌న‌

ఉప్ప‌ల్ వేదిక‌గా ఈ నెల 27న  (బుధ‌వారం) ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ), స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శ‌ర్మ అభిమానుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఓ వ్య‌క్తి ప్రాణాల మీద‌కు తెచ్చింది. మహారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో కొంత‌మంది ఒక‌చోట చేరి ఎస్ఆర్‌హెచ్‌, ఎంఐ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. వీరిలో కొంత‌మంది ధోనీ అభిమానులుంటే, మ‌రికొంత మంది హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారు. ముంబై బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ వికెట్ ప‌డింది. దాంతో రోహిత్ అవుట్ అయిన వెంట‌నే ధోనీ అభిమాని అయిన‌ బండోపంత్ టిబిలే (63) హేళ‌న‌గా మాట్లాడాడు. రోహిత్ శ‌ర్మ ఔటైపోయాడు, ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుంది అని అన్నాడు.

అంతే.. బండోపంత్ మాట‌లకు కోప‌గించుకున్న రోహిత్ అభిమానులు బ‌ల్వంత్‌, సాగ‌ర్ టిబిలే అత‌డిపై దాడికి దిగారు. అత‌ని త‌ల‌పై క‌ర్ర‌లతో బలంగా కొట్టారు. దాంతో బండోపంత్ తీవ్ర ర‌క్త‌స్రావంతో అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న అత‌డిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బండోపంత్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో నిందితులిద్ద‌రినీ అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News