Viral Videos: రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్న మిస్టరీని ఛేదించింది!

Train Passenger Selfie Video Caught Mobile Thief
  • హోలీ వేడుకల కోసం రైలులో పూణె బయలుదేరిన బ్యాంకు ఉద్యోగి
  • మర్నాడు ఉదయం పట్టాలపై విగతజీవిగా కనిపించిన ప్రభాస్ భాంగే
  • తన నుంచి ఫోన్ లాక్కునే దొంగను పట్టుకునే క్రమంలో రైలు నుంచి దూకడంతో మృతి
  • ప్రయాణికుడి సెల్ఫీ వీడియోతో వీడిన మిస్టరీ
రైలు ప్రయాణికుడు సరదాగా తీసుకున్న సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్న మిస్టరీ ముడి విప్పింది. కదులుతున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడి ఫోన్‌ను చోరీ చేసి అతడి మరణానికి కారణమైన దొంగ ఆటకట్టించింది. ప్రయాణికుడు తన సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దాని ద్వారా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా రైలు ప్రయాణికుడి మృతి వెనకున్న మిస్టరీ వీడింది. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన.

ఇంతకీ ఏం జరిగిందే.. 
24 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకల కోసం ఈ నెల 24న పూణెకు సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. 25న అతడి మృతదేహం విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో పట్టాలపై పడి ఉండడంతో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ద్వారా అది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదని తేల్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ల దొంగ అయిన ఆకాశ్ జాదవ్ (27)ను అరెస్ట్ చేశారు.

దొంగను పట్టుకునే క్రమంలో..
పూణె వెళ్తున్న ప్రభాస్ భాంగే అర్ధరాత్రి సమయంలో రైలు డోరు వద్ద నిల్చున్నాడు. ఫోన్ల దొంగ అయిన ఆకాశ్ జాదవ్..  భాంగే చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ దానిని చేజిక్కించుకునేందుకు రైలు నుంచి దూకాడు. ఈ క్రమంలో గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం రైలు ప్రయాణికుడొకరు తీసుకున్న సెల్ఫీ వీడియోలో రికార్డయింది. 

కటకటాల వెనక్కి నిందితడు
ప్రభాస్ ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే, ప్రయాణికుడు షూట్ చేసిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడు ఆకాశ్ జాదవ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Viral Videos
Crime News
Maharashtra
Pune

More Telugu News