YS Avinash Reddy: అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న దస్తగిరి పిటిషన్ ను తిరస్కరించలేమన్న హైకోర్టు
- అప్రూవర్ గా మారిన దస్తగిరి పిటిషన్ చెల్లదన్న అవినాశ్ తరపు లాయర్
- పిటిషన్ వేసే హక్కు అప్రూవర్ కు ఉంటుందన్న హైకోర్టు
- తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దస్తగిరి పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా అవినాశ్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... అప్రూవర్ గా మారిన దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదని చెప్పారు.
ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ... ఇటీవలే ఎన్ఐఏ కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్ ను డివిజన్ బెంచ్ అనుమతించిందని తెలిపింది. పిటిషన్ వేసే హక్కు అప్రూవర్ కు ఉంటుందని చెప్పింది. దస్తగిరి పిటిషన్ ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. తరుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. మరోవైపు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 3కు హైకోర్టు వాయిదా వేసింది.