Chandrababu: జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్‌

Can Jagan answers to these 7 questions asks Chandrababu

  • రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీయేకు ఓటు వేయాలన్న చంద్రబాబు
  • రాయలసీమను జగన్ సైకో రాజ్యంగా మార్చారని మండిపాటు
  • సీమలో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒరగబెట్టిందేముందని ప్రశ్న

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈరోజు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

రోడ్ షో సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... 90 శాతం హామీలను నెరవేర్చానని జగన్ చెప్పుకుంటున్నారని... తాను అడిగే ఏడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కరెంటు చార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాయలసీమను తాము హార్టికల్చర్ హబ్ గా చేశామని... జగన్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చేశారని దుయ్యబట్టారు. గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ ఎన్నికల్లో 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే... జగన్ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 

అసమర్థుడు, అవినీతిపరుడైన జగన్ ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమయిందని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఇసుకను దోపిడీ చేశారని... భనవ నిర్మాణ కార్మికుల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. మద్య నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని జగన్ చెప్పారని... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుగున్నాడని ప్రశ్నించారు. 

ఎన్నికలకు ముందు ఆత్మబంధువులా ముద్దులు పెట్టి, తలలు నిమిరి ఆస్కార్ లెవెల్లో నటించాడని... అధికారంలోకి వచ్చాక అసలైన రూపాన్ని చూపించాడని విమర్శించారు.

  • Loading...

More Telugu News