K Kavitha: తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఏం తిన్నారంటే..!

BRS MLC Kavitha Food Menu in Tihar Jail on First day

  • మంగళవారం రాత్రి అన్నం, పప్పుతో భోజనం
  • బుధ‌వారం ఉద‌యం టీ, స్నాక్స్ తీసుకున్న క‌విత‌
  • జైలులో క‌విత‌ తొలిరోజు పుస్తక పఠనంతో పాటు టీవీ చూశార‌న్న అధికారులు
  • నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని జైలు అధికారుల వివ‌ర‌ణ‌

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు త‌ర‌లించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇక కవిత జైలుకు వెళ్లి ఒకరోజు గడిచింది. తీహార్ జైలు అధికారిక వర్గాల‌ స‌మాచారం ప్రకారం.. జైలులోని 6వ నంబర్ సెల్‌లో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి కవిత ఉంటున్నారు.

మంగళవారం రాత్రి అన్నం, పప్పుతో ఆమె భోజనం చేశారు. తనతో పాటు జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా ఆమె ఆహారం వడ్డించారు. అలాగే బుధ‌వారం ఉద‌యం టీ, స్నాక్స్ తీసుకున్నారు. జైలులో తొలిరోజు పుస్తక పఠనంతో పాటు టీవీ చూశార‌ని స‌మాచారం. కాగా, టీ, ఆహారం, టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటాయ‌ని జైలు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులు ఏవీ డిమాండ్ చేయలేదని కూడా జైలు వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని అధికారులు వివరించారు. 

అయితే, జైలులో ఇంటి భోజనంతో పాటు నిద్రపోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. వీటితోపాటు పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు కూడా న్యాయ‌స్థానం అనుమ‌తి ఇచ్చింది. ఇక కస్టడీ స‌మ‌యంలో కవితకు చేసిన అన్ని వైద్యపరీక్షల తాలూకు రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ని జడ్జి ఆదేశించారు. అలాగే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించ‌డం జ‌రిగింది.

  • Loading...

More Telugu News