Satyam Surana: బ్రిటన్‌ యూనివర్సిటీ ఎన్నికల్లో పోటీపడ్డ భారతీయ విద్యార్థి సంచలన ఆరోపణలు

Indian Student in UK Alleges Hate Campaign

  • లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ స్టూడెంట్ ఎన్నికల్లో పాల్గొంటున్న సత్యమ్ సురానా
  • ఎన్నికల్లో తనపై విష ప్రచారం జరిగిందంటూ సంచలన ఆరోపణలు
  • బీజేపీని సమర్థించినందుకు తనను టార్గెట్ చేశారన్న సత్యమ్
  • సాటి భారతీయులే ఈ విషప్రచారానికి దిగారని తెలిసి మనను కలచివేసిందని వ్యాఖ్య

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ స్టూడెంట్ ఎన్నికల్లో పోటీ పడ్డ భారతీయ విద్యార్థి సత్యమ్ సురానా సంచలన ఆరోపణలు చేశాడు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై బురద జల్లే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించాడు. ఈ క్రమంలోనే కొందరు తన పోస్టర్లు చింపేయడం, బీజేపీ వ్యక్తిగా పేర్కొంటూ బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారని ఆరోపించాడు. పూణెలో జన్మించిన సత్యమ్.. బాంబే హైకోర్టులో కొన్ని రోజులు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆ తరువాత ఎల్ఎల్‌ఎమ్ చేసేందుకు లండన్ వెళ్లాడు. ఈ ఏడాదితో అతడి చదువులు పూర్తి కానున్నాయి. 

కాగా, స్టూడెంట్ ఎన్నికల్లో తనపై జరిగిన విషప్రచారానికి సంబంధించి సత్యమ్ పలు విషయాలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘మార్చి 14-15 మధ్య నా పోస్టర్లను కొందరు చింపేసినట్టు మాకు తెలిసింది. అధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్త పోస్టర్లు అంటించాక మార్చి 16న మళ్లీ కొందరు పోస్టర్లలోని నా ముఖంపై పిచ్చిరాతలు రాశారు. నాకు తప్ప ఎవరికైనా ఓటు వేయాలని అన్నారు. ఓటింగ్‌కు 12 గంటలే ఉందనంగా వ్యతిరేక ప్రచారం పతాకస్థాయికి చేరింది. సత్యమ్ బీజేపీ మనిషి అని, ఫాసిస్టు అని, ఇస్లామ్ వ్యతిరేకి అంటూ స్టూడెంట్ గ్రూపుల్లో మెసేజీలు వెళ్లాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు కురిపించారు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

గతంలో తాను బీజేపీని ప్రశంసిస్తూ పెట్టిన పోస్టులను స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేస్తున్నారని, వీటి ఆధారంగా తనపై ఫాసిస్టు అనే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘భారత్ నా దేశం. నా దేశం కోసం నా గొంతుకను ఎల్లప్పుడూ వినిపిస్తా. అసలు భారత రాజకీయాలకు, బ్రిటన్ యూనివర్సిటీ ఎన్నికలకు లంకె పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. భారత్ ప్రభుత్వంపై నా అభిప్రాయాలన్నీ వ్యక్తిగతమైనవే’’ అని చెప్పుకొచ్చాడు. తనపై విషప్రచారం చేస్తున్న వారందరూ భారతీయులేనని అన్నారు. ఇది లెఫ్ట్ వాదుల పనేనని కుండబద్దలు కొట్టాడు. నరేంద్ర మోదీ సారథ్యంలో భారత పురోగతిని జీర్ణించుకోలేని వారే ఇలా దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఎన్నికల ప్రచారం తొలి దశలో సత్యమ్ లక్ష్యాన్ని చేరుకోలేపోయాడు. కావాలనే తనను టార్గెట్ చేసుకోవడంతో తన ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. సాటి భారతీయులే ఇలాంటి విషప్రచారాలకు పూనుకోవడం తన మనసును కలిచి వేసిందని అన్నాడు. గతేడాది అతివాదులు లండన్‌లోని భారత హైకమిషన్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కింద పడ్డ జాతీయ జెండాను పైకి తీసిన సత్యమ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పలు మీడియా సంస్థలు అతడి పేరును ప్రముఖంగా ప్రస్తావించాయి.

More Telugu News