IPL 2024: సీఎస్‌కే అభిమానులా మజాకా.. ప్లాట్‌ఫామ్ టికెట్‌తో క్రికెట్ మ్యాచ్ చూశారు..!
- చిదంబరం స్టేడియంలో సీఎస్‌కే, ఆర్‌సీబీ మ్యాచ్.. చెపాక్ రైల్వే స్టేషన్ నుంచి వీక్షించిన ఫ్యాన్స్
- ఈ నెల 22న ఇరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ మ్యాచ్
- స్టేడియంలో టికెట్ ధర రూ. 15 వేలు.. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర కేవలం రూ. 10
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. ఇక చెన్నై మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎలాగైనా మ్యాచ్ చూడాల్సిందే అంటారు. ఇదిగో ఇదే కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ నెల 22వ తేదీన ఐపీఎల్ 2024 ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) తలపడిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
అయితే, సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉండి, మ్యాచ్ టికెట్లు దొరకడం కష్టంగా మారింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్ ధర ఏకంగా రూ. 15 వేల వరకు పలికింది. అంత ఖర్చు చేయలేని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ రూ. 10 పెట్టి రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకొని మ్యాచ్ చూశారు. చెపాక్ రైల్వే స్టేషన్ పక్కనే ఈ క్రికెట్ మ్యాచ్ జరిగిన ఎంఏ చిదంబరం స్టేడియం ఉంది. దాంతో రైల్వే స్టేషన్‌లో నిల్చొని.. గోడ రంధ్రాల్లోంచి మ్యాచ్ వీక్షించారు. ఇలా చెన్నై, బెంగళూరు మ్యాచ్‌ను కొందరు రైల్వే స్టేషన్ నుంచి చూసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే మ్యాచ్ ద్వారా ఎంఎస్ ధోనీ నుంచి సీఎస్‌కే కెప్టెన్సీ అందుకున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తొలి మ్యాచ్‌లోనే చెన్నైకి విజయాన్ని అందించాడు. అలాగే మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ సీఎస్‌కే బంపర్ విక్టరీ సాధించింది. ఇలా వరుస విజయాలతో చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌ను ఘనంగా ప్రారంభించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.