Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పగ్గాలు కేజ్రీవాల్ భార్యకేనా?.. బీహార్ ఫార్ములా వర్కవుట్ అవుతుందా?

Kejriwal Wife Enters the Delhi Chief Minister Race

  • జైలు నుంచి కేజ్రీవాల్ పాలన సాధ్యం కాకపోవచ్చంటున్న నిపుణులు
  • దోషిగా తేలి అనర్హత వేటు పడేవరకు పాలించవచ్చంటున్న మరికొందరు
  • సుదీర్ఘకాలం జైలులో ఉండాల్సి వస్తే పగ్గాలు మరొకరు చేపట్టక తప్పని పరిస్థితి 
  • కొత్త ముఖ్యమంత్రి వేటలో ఆప్ నేతలు

మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఆదేశాలు జారీ చేస్తుండడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే పాలన సాగిస్తారని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ముఖ్యమంత్రి కోసం పార్టీ అంతర్గతంగా వెతుకులాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ భార్య సునీత పేరు తెరపైకి వచ్చింది. అలాగే, కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి అతిషి సహా పలువురు సీనియర్లు కూడా సీఎం రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

నిపుణుల తలోమాట
మరోవైపు, జైలు నుంచే పాలన సాగించాలన్న కేజ్రీవాల్ ఆశలు నెరవేరకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న వ్యక్తి వారానికి రెండుసార్లు మాత్రమే ఇతరులతో సమావేశమయ్యే వీలుంది. దీనినిబట్టి చూస్తే రోజువారీ పాలన సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అయితే, కేజ్రీవాల్ కస్టడీని ఈడీ గృహ నిర్బంధం కింద మార్చితే మాత్రం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పాలించేందుకు అడ్డంకులు ఉండబోవని తేల్చి చెబుతున్నారు. కేసులో దోషిగా తేలితేనే ఆయనపై అనర్హత వేటు పడుతుందని, కాబట్టి అంతవరకు ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. ఈ సందర్భంగా  1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనర్హత నిబంధనలను గుర్తు చేస్తున్నారు. 

 సునీత కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారే
తాను జైలులో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం ప్రజలకే అంకితమంటూ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించడం, అది కూడా కేజ్రీవాల్ సీఎంగా నిత్యం కూర్చునే కుర్చీలోనే కూర్చుని ఆ సందేశాన్ని చదవడంతో తదుపరి సీఎం ఆమేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సునీత కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారే. కేజ్రీవాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినా సునీత మాత్రం ఉద్యోగంలోనే కొనసాగారు. 2016లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయితే, ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. ఇప్పుడిదే ఫార్మాలాను ఆప్ అనుసరించబోతున్నదన్న చర్చ జరుగుతోంది. 

రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, ఆతిషి పేర్లు కూడా
ఇంకోవైపు, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరు కూడా వినిపిస్తోంది. వీరితోపాటు మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఈ నెల 28 వరకు ఉంది. ఆ తర్వాత ఆయనకు విముక్తి లభిస్తే సరే, లేదంటే మనీశ్ సిసోడియాలా సుదీర్ఘకాలం జైలులో ఉండాల్సి వస్తే మాత్రం సీఎం పగ్గాల మార్పు తప్పకపోవచ్చు.

Arvind Kejriwal
Sunita Kejriwal
AAP
Delhi CM
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News