Chandrababu: కుప్పంలో నన్ను ఓడించడం వీళ్ల వల్ల అవుతుందా?: చంద్రబాబు

Chandrababu says nobody can defeat him in Kuppam

  • కుప్పంలో చంద్రబాబు బహిరంగ సభ
  • ఈసారి తనకు లక్ష మెజారిటీ ఖాయమని ధీమా
  • వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని పిలుపు
  • వచ్చే ఐదేళ్లలో కుప్పంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కుప్పంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కుప్పం ప్రజలు ఈసారి తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కుప్పం ప్రజలను తానెప్పుడూ ఇలా అడగలేదని అన్నారు. కానీ ప్రజలే తనకు భారీ మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారా, నమ్మకమేనా? అని చంద్రబాబు కుప్పం ప్రజానీకాన్ని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు. 

రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం... అన్ని ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నియోజకవర్గం కుప్పం, సైకిల్ కు తప్ప వేరే పార్టీకి ఓటేయని నియోజకవర్గం కుప్పం... ఇది బంగారు కుప్పం అని అభివర్ణించారు. 

"ఇలాంటి కుప్పంలో మీరు చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అందుకే అడుగుతున్నా. గతంలో 70 వేల మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి టార్గెట్... లక్ష ఓట్ల మెజారిటీ. ఇప్పటికే ఏడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి ఎంతో రుణపడి ఉన్నాను. గత 35 ఏళ్లలో ఏం చేశానో, అంత అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తాను. మీది, నాది ఈనాటి బంధం కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు నా ఇల్లు. ప్రతి గ్రామం నా గ్రామమే. ప్రతి కుటుంబం నా కుటుంబమే. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా నా ఇబ్బందిగానే భావించి మీకు అండగా నిలుస్తాను. 

మొన్న చాలా మంది కుప్పిగంతలు వేశారు. కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తాం... వై నాట్ కుప్పం, వై నాట్ 175 అన్నారు. కుప్పంలో నన్ను ఓడించడం వీళ్ల వల్ల అవుతుందా? నేను అడుగుతున్నా... వై నాట్ పులివెందుల? జగన్... నీకెందుకు ఓటెయ్యాలి? బాబాయిపై గొడ్డలి వేటు వేసినందుకా? రాష్ట్రాన్ని దోచుకున్నందుకా? రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసినందుకా? 

ఈ రోజు కుప్పం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రజాగళానికి శ్రీకారం చుడుతున్నా. ఈ ప్రజాగళం ఉద్ధృతంగా మారి, తీవ్ర వాయుగుండంగా మారి... అడ్డొచ్చిన వాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. సమయం ఉందని అశ్రద్ధ చేయొద్దు తమ్ముళ్లూ! సైకిల్ గాలి ఉద్ధృతంగా వీయాలి. ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టని అడిగినా... సైకిల్, దాని మిత్రపక్షాల మాటే వినపడాలి. ఫ్యాన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలంతే. చేసిన తప్పుడు పనులకు ఆ ఫ్యాన్ కనపడకూడదు. 

కుప్పం ప్రజలు లక్ష మెజారిటీ ఇస్తామని మాటిచ్చారు... రాష్ట్రంలో టీడీపీ కూటమిని 175కి 175 స్థానాల్లో గెలిపిస్తామని రాష్ట్ర ప్రజలు సంకల్పం చేయాలి. ఐదేళ్లపాటు వైసీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలు, బాదుడే బాదుడు... ఇలా అన్నీ చూశాం. సామాన్య పౌరుల కుటుంబాల నుంచి, అన్ని వర్గాల వారు నష్టపోయారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ప్రైవేటు ఆస్తులు, కంపెనీలు, పరిశ్రమలు, వాటాలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు, తాము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో రౌడీలను నియంత్రిస్తాం. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నాం.

ఇటీవల హంద్రీనీవా నీళ్ల పేరుతో జగన్ వచ్చి హంగామా చేశారు. కానీ కుప్పంకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నాడు హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం నేనే పూర్తి చేశాను. వచ్చే సీజన్ లో కుప్పంకు నీళ్లు తెచ్చి అన్ని చెరువులు నింపుతాం. నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తున్నారు. శాంతిపురంలో కేజీఎఫ్ మాదిరిగా తవ్వేశారు. వైసీపీ నేతలు యధేచ్ఛగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. పుంగనూరు వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తా" అంటూ  చంద్రబాబు హెచ్చరించారు.

More Telugu News