Acne Treatment: మొటిమల క్రీములను ఫ్రిజ్‌లో చల్లబరిచాకే వాడండి.. డాక్టర్ల సూచన

Doctors Recommend Chilling Acne Creams Before Use To Reduce Cancer Risk

  • బెంజాయిల్ పెరాక్సైడ్ ఆధారిత మొటిమల ట్రీట్‌మెంట్స్‌లో బెంజీన్ అవశేషాలు బయటపడ్డ వైనం
  • అమెరికాలోని ఓ స్వతంత్ర ల్యాబ్ జరిపిన పరీక్షల్లో వెల్లడి
  • ఈ క్రీములను చల్లబరిస్తే క్యాన్సర్ కారకాల ప్రభావం చాలా వరకూ తగ్గుతుందన్న వైద్యులు

బెంజాయిల్ పెరాక్సైడ్ ఆధారిత మొటిమల క్రీమ్‌లు, జెల్స్, వాష్‌లను ముందుగా ఫ్రీజ్‌లో చల్లబరిచాక వాడాలని అమెరికాలోని డెర్మటాలజిస్టుల అసోసియేషన్ ఒకటి తాజాగా సూచించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక బెంజీన్ రసాయన అవశేషాలు ఉన్నందుకు వీటిని నిషేధించాలంటూ స్వతంత్ర క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ వెలీషూర్ సూచించింది. ఈ మేరకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు మొటిమల క్రీములను ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలని సూచించారు. ఇలా చేస్తే క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం చాలా వరకూ తగ్గుతుందని అమెరికా ఆక్నే, రోసాసియా సొసైటీ (ఏఏఆర్ఎస్) బుధవారం ఓ ప్రకటన చేసింది. 

వెలీషూర్ పరీక్షల ఫలితాలు తమను ఒకింత ఆశ్చర్యపరిచాయని ఏఏఆర్ఎస్ అధ్యక్షుడు జేమ్స్ డెల్ రోసో వ్యాఖ్యానించారు. గత ఐదు దశాబ్దాలుగా ఈ ట్రీట్‌మెంట్ ఉనికిలో ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు మరింత పరిశోధన జరగాలన్నారు. మొటిమలు, ఇతర చర్మసంబంధిత సమస్యల చికిత్సలో బెంజాయిల్ పెరాక్సైడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఏఏఆర్ఎస్ పేర్కొంది.  

మరోవైపు, వెలీషూర్ ల్యాబ్ పిటిషన్‌పై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ స్పందించింది. వెలీషూర్ సమాచారాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అమెరికాలోని ప్రముఖ బ్రాండ్స్ ప్రొయాక్టివ్, క్లియరాసిల్‌పై స్టెబిలిటీ పరీక్షలు నిర్వహించగా వాటిల్లోని బెంజీన్ కంటెంట్ పెరిగినట్టు వెలీషూర్ ల్యాబ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News