Ambati Rambabu: షాపింగ్ మాల్‌లో భారీగా చీరలు.. అంబటి రాంబాబుపై టీడీపీ ఆరోపణలు
- పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని షాపింగ్ మాల్‌లో చీరలు దాచారంటూ టీడీపీ ఆరోపణలు
- ఘటన వెనక అంబటి రాంబాబు హస్తం ఉందంటూ మండిపాటు
- మాల్ వద్దకు భారీగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్తతలు
- కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, షాపింగ్ మాల్‌లో తనిఖీలు
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని షాపింగ్ మాల్‌లో భారీగా చీరలు దాచారన్న వార్త ఎన్నికల వేళ ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక వైసీపీ నేతకు చెందిన కేవీఆర్ మార్ట్‌లో భారీగా చీరలు ఉన్నాయంటూ టీడీపీ శ్రేణులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఓటర్లకు వైసీపీ నేతలు చీరలు పంచాలని చూస్తున్నారంటూ ఆరోపించాయి. దీని వెనక వైసీపీ నేత అంబటి రాంబాబు హస్తం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు షాపింగ్ మాల్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ నేతలతో వారు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. పోలీసులు షాపింగ్ మాల్‌లో తనిఖీలు చేపట్టారు.