Anam Venkata Ramana Reddy: జగన్ కు ప్రాణహాని ఉందని గతంలో డీజీపీ చెప్పారు... ఇప్పుడు బస్సు యాత్రకు ఎలా అనుమతిస్తారు?: టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర
- ఐదేళ్లలో తొలిసారిగా జనంలోకి వస్తున్న జగన్ కు స్వాగతం అంటూ ఆనం వ్యంగ్యం
- పరదాలు కట్టుకని బస్సు యాత్ర చేస్తారా...? అంటూ ఎద్దేవా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరిట ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర చేస్తుండడంపై ఆయన స్పందించారు.
ఈ ఐదేళ్లలో తొలిసారిగా జనంలోకి వస్తున్న జగన్ ను స్వాగతిస్తున్నాం అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల కారణంగానే బస్సు యాత్ర పేరుతో జగన్ బయటికి వస్తున్నారని విమర్శించారు.
జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని గతంలో డీజీపీ చెప్పారని, అలాంటప్పుడు బస్సు యాత్ర చేసేందుకు జగన్ ను ఎలా అనుమతిస్తారని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. జగన్ కు ప్రాణాపాయం లేదంటే గతంలో డీజీపీ చెప్పిన మాటలు అబద్ధమా? అని ప్రశ్నించారు.
జగన్... హెలికాప్టర్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గతంలో చేసినట్టు పరదాలు కట్టుకుని బస్సు యాత్ర చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా ప్రజలకు దూరమైనందుకు క్షమాపణ చెప్పి ఆ తర్వాతే బస్సు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు.