Baba Ramdev: బాబా రాందేవ్ కు సమన్లు జారీ చేసిన సుప్రీంకోర్టు

SC issues showcause notice to Ramdev

  • పతంజలి విక్రయిస్తున్న ఉత్పత్తుల ప్రకటనల గురించి ఇచ్చిన హామీని ఉల్లంఘించారన్న సుప్రీంకోర్టు
  • మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదని రాందేవ్ బాబా, బాలకృష్ణలకు ప్రశ్న
  • తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు

కోర్టు ధిక్కరణ నోటీసుకు స్పందించక పోవడంతో పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తమ ముందు హాజరు కావాలంటూ ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. బాబా రాందేవ్ తో పాటు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కూడా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం సమన్లు పంపించింది. 

పతంజలి విక్రయిస్తున్న ఉత్పత్తులు, ఔషధాల నాణ్యతకు సంబంధించిన ప్రకటనల గురించి కోర్టుకు ఇచ్చిన ప్రాథమిక హామీని ఉల్లంఘించినందుకు గత నెలలోనే ఆ సంస్థను సుప్రీంకోర్టు నిలదీసింది. తాజాగా పతంజలి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద మీ మీద చర్యలను ఎందుకు ప్రారంభించకూడదని పతంజలికి, బాలకృష్ణకు జారీ చేసిన నోటీసుల్లో ప్రశ్నించింది. తమ గత ఆదేశాల తర్వాత పతంజలి ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించిందని... ఆ తర్వాత ఇప్పటి వరకు తమ ఆర్డర్స్ పై ఎందుకు సమాధానాన్ని ఫైల్ చేయలేదని నిలదీసింది. తదుపరి విచారణలో పతంజలి ఎండీ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 

డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ లోని సెక్షన్లు 3, 4 (తప్పుదోవ పట్టించే యాడ్స్)లను రాందేవ్ బాబా, బాలకృష్ణలు ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదని రాందేవ్ కు పంపిన సమన్లలో ప్రశ్నించింది. పతంజలి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ... రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంలోకి రాందేవ్ బాబా ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. 'తదుపరి వాయిదాకు మీరు వస్తారు కదా. అప్పుడు చూద్దాం. ఇప్పటికి ఇంతే' అని వ్యాఖ్యానించింది.

Baba Ramdev
Balakrishna
Patanjali
Supreme Court
Summons
  • Loading...

More Telugu News