Bharat Jodo Nyaya Yatra: ఆయన మా అమ్మతో చెప్పుకొని ఏడ్చారు: రాహుల్ గాంధీ

Congress top leader Rahul Gandhi concluded his Bharat Jodo Nyaya Yatra in Mumbai on Sunday

  • మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికే బీజేపీలోకి వెళ్లారని విమర్శలు
  • ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో బీజేపీపై మండిపడ్డ రాహుల్ గాంధీ

కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఒక దుష్టశక్తితో పోరాడుతున్నామని మండిపడ్డారు. ఒక రాజు ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీలలో (ఇన్‌కమ్ ట్యాక్స్) ఉందని మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీనియర్ నాయకుడు ఒకరు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారారని అన్నారు. తాను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ మహరాష్ట్రకు చెందిన చెందిన ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారని అన్నారు. 

‘‘ఆయన ఏడుస్తూ మా అమ్మ సోనియాతో మాట్లాడారు. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఈ వ్యక్తులతో, ఈ శక్తితో పోరాడే శక్తి నాకు లేదు. నాకు జైలుకు వెళ్లడం ఇష్టం లేదు’’ అని ఆయన విలపించారని రాహుల్ అన్నారు. గత నెలలో బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సందర్భంగా ముంబైలో ఆదివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ‘వాషింగ్ మెషిన్’ అని, ఆ పార్టీలో చేరగానే అశోక్ చవాన్‌ మంచివారు అయిపోయారని రాహుల్ గాంధీ అన్నారు. మరో నేత మిలింద్ దేవరా కూడా బీజేపీలో చేరగానే ఆయనపై అవినీతి ఆరోపణలన్నీ మటుమాయం అయ్యాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేతో మాజీ సీఎం అశోక్ చవాన్‌కు తీవ్ర విభేదాలు ఉన్నాయని, పార్లమెంటులో సమర్పించిన శ్వేతపత్రంలో ఆదర్శ్ కుంభకోణాన్ని ప్రస్తావించడమే ఇందుకు కారణమని రాహుల్ విమర్శించారు.

కాగా చవాన్‌పై మహారాష్ట్రలో ప్రస్తుతం మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు కేసులు ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించినవే కావడం గమనార్హం. 2000లో ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కోసం భూమిని అక్రమంగా కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో చవాన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఉన్న విభేదాల కారణంగానే పార్టీని వీడినట్టు అశోక్ చవాన్ వెల్లడించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News