Mudragada Padmanabham: సస్పెన్స్‌కు తెర.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. వీడియో ఇదిగో!

Mudragada Padmanabham Joins YCP Today
  • కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న కాపు ఉద్యమ నేత
  • మొన్ననే చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో కండువా
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్‌కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముద్రగడతోపాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.

ముద్రగడ రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరపడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నట్టు ముద్రగడ ఇటీవల ప్రకటించారు. మొన్ననే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నేతగా మారారు.

ముద్రగడ 1978లో జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక అందులో చేరారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు.
Mudragada Padmanabham
Mudragada Giri
YSRCP
Andhra Pradesh

More Telugu News